Nagababu: మళ్లీ లాక్ డౌన్ విధిస్తే చారిత్రక తప్పిదం అవుతుంది: నాగబాబు

Nagababu requests governments do not impose another lockdown
  • కరోనా పరిస్థితులపై నాగబాబు స్పందన
  • మళ్లీ లాక్ డౌన్ విధిస్తే చెడే ఎక్కువ జరుగుతుందని వెల్లడి
  • ప్రజల్లో తిరుగుబాటు భావాలు వస్తాయని ఆందోళన
కరోనా పరిస్థితులపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు స్పందించారు. మరోసారి లాక్ డౌన్ విధించే నిర్ణయాలు ఎవరూ తీసుకోవద్దని, మళ్లీ లాక్ డౌన్ విధిస్తే మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

"అసలు లాక్ డౌన్ అనేది ఎందుకు విధిస్తారు? అన్ని రకాల శక్తులు, వనరులను సమీకరించుకోవడానికే కదా! ప్రజలందరూ 90 రోజుల పాటు తమ జీవితాలను వదిలేశారు. వలస కార్మికుల వెతలు చెప్పనలవి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి లాక్ డౌన్ ప్రకటించి, ప్రజల జీవితాలను స్తంభింపచేస్తే అది చారిత్రక తప్పిదం అవుతుంది. ఏ రాష్ట్రం అయినా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే సరిదిద్దుకోలేని తప్పుగా మిగిలిపోతుంది.

చాలా దేశాలు లాక్ డౌన్ లేకుండానే కరోనాను ఎదుర్కొంటున్నాయి. మనది పెద్ద దేశం కావడంతో ఇప్పటివరకు లాక్ డౌన్ నిర్ణయం సమంజసమే కావొచ్చు కానీ, మళ్లీ లాక్ డౌన్ అంటే ఆ నిర్ణయం సరికాదు. కరోనా నివారణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు స్పష్టంగా చెప్పండి. వాళ్లతో పాటించేలా చేయండి. ఇంకెన్నాళ్లు పని లేకుండా ఉండాలి? కరోనాతో చస్తే చచ్చాం... మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వండి అనేంతగా తిరుగుబాటు భావాలు ప్రజల్లోకి కలగడం సరికాదు" అని వ్యాఖ్యానించారు.

ఇన్నాళ్ల లాక్ డౌన్ అనంతరం ప్రభుత్వాలు తగిన వనరులు సమీకరించుకుని ఉండాలని, కరోనా వచ్చిన ప్రతి ఒక్కరికీ చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. 90 రోజుల లాక్  డౌన్ తో ప్రజలు ఇళ్లలో ఉండడం ద్వారా తమ బాధ్యత నిర్వర్తించారని, లాక్ డౌన్ తో తమ జీవితాలను వదిలేసుకున్నారని, ఇప్పుడు ప్రభుత్వాలు తమ బాధ్యత నెరవేర్చాల్సిన సమయం వచ్చిందని నాగబాబు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ వైద్య సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Nagababu
Lockdown
Government
Corona Virus

More Telugu News