Khammam District: దాహం తీర్చుకునేందుకు వచ్చిన వానరంపై అమానుషం.. ఉరివేసి కొట్టి చంపేసిన వైనం!

Monkey killed by villagers in khammam

  • ఖమ్మం జిల్లా అమ్మపాలెంలో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • కేసు నమోదు, రూ. 25 వేల జరిమానా 

దాహంతో అలమటించిపోయిన వానరం ఓ ఇంటి ముందు కనిపించిన నీళ్ల తొట్టి వద్దకు వచ్చింది. నీళ్లు తాగుతూ పట్టుతప్పి అందులో పడిపోయింది. దానిని పట్టుకున్న ఆ ఇంటి యజమాని అమానుషంగా ప్రవర్తించాడు. తాడుతో ఉరివేసి కొట్టి చంపాడు. ఖమ్మం జిల్లా వేంనూరు మండలంలో జరిగిందీ అమానుష ఘటన. అటవీశాఖ అధికారుల కథనం ప్రకారం.. మండలంలోని అమ్మపాలెంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఈ నెల 26న సాధు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్న తొట్టెలో నీళ్లు తాగేందుకు ప్రయత్నించిన ఓ వానరం పట్టు తప్పి అందులో పడిపోయింది. వెంకటేశ్వరరావు మరో ఇద్దరితో కలిసి దానిని పట్టుకుని మెడకు తాడు కట్టి చెట్టుకు వేలాడదీశారు.

అనంతరం కర్రలతో దారుణంగా కొట్టి చంపారు. వేలాడుతున్న కోతి కళేబరాన్ని సాయంత్రం వరకు అలాగే ఉంచేశారు. కోతికి ఉరేసి కొట్టి చంపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీ శాఖ అధికారులు స్పందించారు. గ్రామానికి చేరుకుని వానరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. వానరంపై దాడి చేసిన నిందితులు వెంకటేశ్వరరావు, జోసెఫ్ రాజు, గౌడెల్లి గణపతిలను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి రూ. 25 వేల జరిమానా విధించారు.

  • Loading...

More Telugu News