Lightening: వరల్డ్ రికార్డు సాధించిన అతిపెద్ద మెరుపు

Lightening in Brazil set a world record
  • ఏకంగా 700 కిలోమీటర్ల పొడువుతో జిగేల్మనిపించిన మెరుపు
  • కొన్ని క్షణాల పాటు వెలిగిపోయిన బ్రెజిల్
  • 16.73 సెకన్లతో అర్జెంటీనా మెరుపు కూడా వరల్డ్ రికార్డు
సాధారణంగా వర్షం పడే సమయంలో ఉరుములు, మెరుపులు సహజం. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతితో మెరుపులు క్షణకాలంలో ఆకాశాన్ని వెలిగిస్తాయి. మెరుపుల నిడివి కేవలం కొన్నిసెకన్ల పాటే, అది కూడా కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే కనిపిస్తాయి. కానీ గతేడాది బ్రెజిల్ దేశంలో మెరిసిన ఓ మెరుపు ప్రపంచ రికార్డు సృష్టించింది.

ఈ మెరుపు ఏకంగా 700 కిలోమీటర్ల పొడవుతో బ్రెజిల్ దేశాన్ని కొన్ని సెకన్ల పాటు జిగేల్మనిపించింది. బోస్టన్, వాషింగ్టన్ డీసీల మధ్య ఎంత దూరం ఉంటుందో ఈ మెరుపు అంత పొడవున ఏర్పడి రికార్డు పుటల్లో చోటు దక్కించుకుంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం వరల్డ్ మెటియరాలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంఓ) వెల్లడించింది.

ఎక్కువ పొడవున్న మెరుపు బ్రెజిల్ లో చోటుచేసుకోగా, ఎక్కువసేపు నిలిచిన మెరుపు అర్జెంటీనాలో గతేడాది మార్చి 4న సంభవించింది. ఈ వరల్డ్ రికార్డు మెరుపు 16.73 సెకన్ల పాటు మెరిసింది. ఇప్పటివరకు ఎక్కువ పొడవున్న మెరుపు 2007లో అమెరికాలో ఏర్పడింది. ఇది 321 కిలోమీటర్ల పొడవున కనిపించింది. ఇక అధిక సమయం నిలిచిన మెరుపు 2012లో దక్షిణ ఫ్రాన్స్ లో సంభవించింది. అది 7.74 సెకన్ల పాటు కనిపించింది. ఇప్పుడా రెండు రికార్డులు తెరమరుగయ్యాయి.
Lightening
Brazil
World Record

More Telugu News