Chandrababu: కుప్పం బ్రాంచ్ కెనాల్ పెండింగ్ బిల్లులను ఆపివేయడం కక్షసాధింపే: చంద్రబాబు

Chandrababu Letter to Water Resources Department
  • 90 శాతం పూర్తయిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు
  • ఏడాదిగా మిగతా 10 శాతం పనులు పెండింగ్
  • కావాలనే ప్రభుత్వం ఇలా చేస్తోందన్న చంద్రబాబు
  • జల వనరుల శాఖ కార్యదర్శికి లేఖ
కుప్పం బ్రాంచ్ కెనాల్ విషయంలో పెండింగ్ బిల్లులను ఆపివేయడం ద్వారా వైఎస్ జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. కెనాల్ పనుల నిలిపివేతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ఈ మేరకు జల వనరుల శాఖ స్పెషల్ సెక్రెటరీకి ఓ లేఖ రాశారు.

చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతం తీవ్రమైన తాగు, సాగునీటి ఎద్దడితో ఉందని గుర్తు చేసిన ఆయన, ముఖ్యంగా కుప్పం, పలమనేరు ప్రజలు, రైతులకు ఈ కెనాల్ నీరు ఎంతో ముఖ్యమని అన్నారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని, కేవలం 10 శాతానికి సమానమైన రూ. 50 కోట్ల విలువైన పనులు మిగిలివున్న సమయంలో పనులు ఆపివేశారని ఆయన ఆరోపించారు.

 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ కెనాల్ పనులు వేగంగా సాగాయని, ఇప్పుడు ఏడాదిగా బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టారని తన లేఖలో చంద్రబాబు విమర్శించారు. పనులను సకాలంలో పూర్తి చేస్తే, దాదాపు 110 చెరువులను నింపుకునే నీళ్లు అందించే వీలుండేదని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జల వనరుల ప్రాజెక్టులను పట్టించుకున్న దాఖలాలు లేవని చంద్రబాబు మండిపడ్డారు. వెంటనే కుప్పం బ్రాంచ్ కెనాల్ మిగిలిన పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రత్యేక కార్యదర్శిని ఆయన కోరారు.
Chandrababu
Kuppam
Branck Cannal

More Telugu News