Gujarat: గుజరాత్‌లో మందుపార్టీ.. హైదరాబాదీ, ఐదుగురు యువతుల సహా 12 మంది జూనియర్ డాక్టర్ల అరెస్ట్

12 junior doctors arrested for celebrate liquor party
  • వడోదరలో పార్టీ చేసుకుంటూ దొరికిన జూనియర్ వైద్యులు
  • సుమన్‌దీప్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులుగా పనిచేస్తున్న వైనం
  • అరెస్ట్ చేసిన అనంతరం స్టేషన్ బెయిులుపై విడుదల
పూర్తిస్థాయి మద్య నిషేధం అమల్లో ఉన్న గుజరాత్‌లో మందు పార్టీ చేసుకున్న 12 మంది జూనియర్ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఓ హైదరాబాదీతోపాటు ఐదుగురు యువతులు కూడా ఉన్నారు. వడోదర రూరల్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఇక్కడి సుమన్‌దీన్ విద్యాపీఠ్‌తోపాటు దీని అనుబంధ వైద్యశాల సుమన్‌దీప్ ఆసుపత్రిలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు చదువుకుంటున్నారు.

గుజరాత్‌లోని మీన్‌నగర్ ప్రాంతానికి చెందిన జైన్ మెహతా, ఘట్లోడియాకు చెందిన కిరణ్ మెహతాలు జూనియర్ డాక్టర్లుగా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి తన సహచరులైన మరో 10 మందితో కలిసి ఆమోదర్ గ్రామంలోని శ్యామల్ కౌంటీలో మందు పార్టీ చేసుకున్నారు. ఈ బృందంలో ఐదుగురు యువతులు కూడా ఉన్నారు. వారు మద్యం తాగుతున్నట్టు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొత్తం 12 మందినీ అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి స్వదేశీ, విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌‌కు చెందిన వారితో పాటు హైదరాబాద్‌కు చెందిన జూనియర్‌ డాక్టర్‌ కోషి జోసెఫ్‌ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన 12 మందినీ ఆ తర్వాత స్టేషన్ బెయిలుపై విడుదల చేసినట్టు చెప్పారు.
Gujarat
Vadodara
Junior doctors
liquor party
arrest

More Telugu News