Chandrababu: గిరిజన ప్రగతిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా?: జగన్ కు చంద్రబాబు లేఖాస్త్రం
- గిరిజనులెవ్వరూ అవకాశాలను పోగొట్టుకోకూడదు
- వారి అవకాశాలను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత
- గిరిజన ప్రాంతాల్లోని టీచర్ ఉద్యోగాలన్నీ వారితోనే భర్తీ చేయాలి
- ఇప్పటికైనా గిరిజనుల హక్కులను కాపాడాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గిరిజన ప్రాంతాలలోని టీచర్ ఉద్యోగాలన్నీ 100 శాతం గిరిజనులతోనే భర్తీ చేయాలన్న విషయంపై జగన్‌కు లేఖ రాశానని చెప్పారు.
'స్వతంత్ర భారతదేశంలో గిరిజనులెవ్వరూ వారి ప్రగతికి గల అవకాశాలను పోగొట్టుకోకూడదని, దోపిడీకి గురికాకూడదని నాటి రాజ్యాంగ పరిషత్ లో ఒకే ఒక గిరిజన ప్రతినిధి శ్రీ జైపాల్ సింగ్ ముండా పేర్కొన్నారు. అటువంటి రాజ్యాంగ నిబద్ధత ప్రకారం గిరిజనులు ఎదిగే అవకాశాలను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
'గిరిజన ప్రాంతాలలోని టీచర్ ఉద్యోగాలన్నీ 100 శాతం గిరిజనులతోనే భర్తీ చేయాలంటూ తెలుగుదేశం ప్రభుత్వం 2000, జనవరి 10వ తేదీన జీవో నం.3ని తెచ్చింది. రెండు దశాబ్దాలకు పైగా అమలులో ఉన్న ఆ జీవో ఇప్పుడు అమలు కాకుండా పోయే పరిస్థితి వచ్చినా ప్రభుత్వంలో ఏ స్పందనా లేదు' అని చెప్పారు.
'గిరిజన ప్రగతిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? ఇప్పటికైనా గిరిజనుల హక్కులను, అవకాశాలను కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశాను. గిరిజనులకు సమాన అవకాశాలు దక్కేలా తెలుగుదేశం నిరంతరం పోరాడుతుంది' అని తెలిపారు.