Rahul Gandhi: పెద్ద సంఖ్యలో మన జవాన్లు అమరులైనా.. మీరెందుకు మౌనంగా వున్నారు?: మోదీపై రాహుల్ ఫైర్

Why you are hiding Rahul Gandhi questions Modi
  • 20 మంది జవాన్లు అమరులయ్యారు
  • దేశ ప్రజలంతా వాస్తవాలను తెలుసుకోవాలనుకుంటున్నారు
  • భయపడకండి.. నిజాన్ని వెల్లడించండి
లడఖ్ సమీపంలోని భారత్-చైనా వాస్తవాదీన రేఖ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన దాడుల్లో భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగింది. 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఇదే సమయంలో చైనా వైపు ఇంత కంటే ఎక్కువ మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే తమ సైనికులు ఎంత మంది చనిపోయారనే విషయాన్ని చైనా దాచి పెడుతోంది.

మరోవైపు, ఈ దాడులు మన దేశంలో రాజకీయ సెగను పుట్టిస్తున్నాయి. దీనిపై ప్రధాని మోదీ నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం తరపున కానీ ఎలాంటి స్పందన వెలువడలేదు. ఈ నేపథ్యంలో మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు. పెద్ద సంఖ్యలో జవాన్లు అమరులు అయినప్పటికీ ఆయన ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు ఆయన ఏదో దాస్తున్నారు? జరిగిందేమిటో అందరం తెలుసుకోవాలనుకుంటున్నాం. మా సైనికులను చంపడానికి, మా భూభాగాన్ని ఆక్రమించడానికి చైనాకు ఎంత ధైర్యం' అని రాహుల్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ట్వీట్ తర్వాత ఓ వీడియోను కూడా రాహుల్ పోస్ట్ చేశారు. చైనాతో ఘర్షణ సందర్బంగా అమరులైన జవాన్లకు రాహుల్ సంతాపం ప్రకటించారు. మోదీ  బయటకు వచ్చి నిజాలు మాట్లాడాలని డిమాండ్ చేశారు. 20 మంది ప్రాణాలను చైనా బలిగొందని... మన భూభాగాన్ని ఆక్రమించుకుందని... అయినా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ మోదీని నిలదీశారు. యావత్ దేశం మీ వెనకే ఉందని... భయపడాల్సిన అవసరం లేదని... నిజాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Rahul Gandhi
Congress
Narendra Modi
BJP
Ladakh
India
China
Faceoff

More Telugu News