Telugudesam: రేపటి నుంచి జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని టీడీపీ నిర్ణయం

TDP decides to attend assembly sessions
  • చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం 
  • తమ నేతల అరెస్టులు సహా పలు అంశాలను లేవనెత్తాలని నిర్ణయం
  • కేవలం రెండు రోజులు మాత్రమే జరగనున్న సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభంకానున్నాయి. రెండు రోజుల పాటు (జూన్ 16, 17) సమావేశాలు జరగనున్నాయి. అయితే టీడీపీ కీలక నేతలను అరెస్ట్ చేసిన నేపథ్యంలో సమావేశాలకు టీడీపీ హాజరవుతుందా? లేదా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు కరోనా, లాక్ డౌన్ తదితర ఇబ్బందులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. సమావేశాలను బహిష్కరిద్దామనే ప్రతిపాదనలు కూడా భేటీలో వచ్చాయి. అయితే, సమావేశాలకు హాజరుకావాలని చివరకు టీడీఎల్పీ నిర్ణయించింది.

అయితే గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్బంగా టీడీపీ నేతల అక్రమ అరెస్టులు, ఎల్జీ పాలిమర్స్ ఘటన, మద్యం ధరలు, ఇసుక మాఫియా తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీఎల్పీ నిర్ణయించింది. టీడీపీ నేతల అక్రమ అరెస్టులపై గవర్నర్ ను కలిసి వినతి పత్రాన్ని అందించాలని కూడా నిర్ణయించారు.

రేపు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం సెషన్ లో వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. బడ్జెట్ పై స్వల్పకాలిక చర్చను జరిపి... తొలిరోజు సమావేశాలను ముగిస్తారు. రెండో రోజు (17వ తేదీ) కొన్ని బిల్లులను ప్రవేశపెట్టి, వాటిపై స్వల్ప చర్చ జరిపి, వాటిని ఆమోదిస్తారు. ఆ వెంటనే సభ నిరవధికంగా వాయిదా పడుతుంది.

మరోవైపు, సమయం తక్కువగా (రెండు రోజులే) ఉండటంతో... సభ ఎలా జరుగుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం యత్నిస్తుంది. వాగ్వాదం ఎక్కువైతే నిర్ణీత సమయంలోగా బిల్లులను ఆమోదించుకోవడం కష్టమవుతుంది. దీంతో, ప్రతివ్యూహాలతో ప్రభుత్వం కూడా సిద్ధమవుతోందని తెలుస్తోంది. అవసరమైతే, టీడీపీ ఎమ్మెల్యేలను బహిష్కరించే అవకాశం కూడా లేకపోలేదనేది విశ్లేషకుల అంచనా.
Telugudesam
AP Assembly Session

More Telugu News