Raghurama Krishnamraju: మా పార్టీలో ఓ విచిత్రమైన సిద్ధాంతం ఉంది: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

MP Raghurama Krishnamraju objects MLA Prasada Raju comments
  • మరోసారి మీడియా ముందుకు వచ్చిన నరసాపురం ఎంపీ
  • సొంత పార్టీలోనే విమర్శలు వస్తుండడంపై వివరణ
  • ఎంతో బతిమాలితేనే వైసీపీలోకి వచ్చినట్టు వెల్లడి
పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో విభేదాలు తీవ్రరూపు దాల్చిన నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తన వ్యాఖ్యలతో వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. తాజాగా స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తిరుపతి వెంకన్న భూముల వేలం, ఇసుక మాఫియా అక్రమాలు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అక్రమ వసూళ్లు, భూముల కొనుగోళ్లలోనూ అవకతవకలు జరుగుతున్నాయని కొంతకాలంగా సీఎం జగన్ దృష్టికి తీసుకెళుతుంటే వైసీపీ వాళ్లే నొచ్చుకున్నారని తెలిపారు. దాంతో సొంత పార్టీ నుంచే తనపై విమర్శలు వస్తున్నాయని అన్నారు.

"మా పార్టీలో ఓ విచిత్రమైన సిద్ధాంతం ఉంది. ఇతర పార్టీల్లోని ఎవరినైనా తిట్టాలంటే వైసీపీలో ఉన్న వారి సామాజిక వర్గం నేతలతోనే తిట్టిస్తారు. ఉదాహరణకు, పవన్ కల్యాణ్ ను ఏమైనా అనాలంటే మా పార్టీలో ఉన్న వారి సామాజిక వర్గ ఎమ్మెల్యేలతోనో, మరొకరితోనే మాట్లాడిస్తారు. ఇప్పుడు నాపైనా అదే తీరులో నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుతో మాట్లాడిస్తున్నారు. జగన్ దయతో 20 రోజుల్లో ఎంపీనయ్యానని, జగన్ వల్లే పార్లమెంటు కమిటీ చైర్మన్ అయ్యానని ప్రసాదరాజు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ నా అంతట నేను ఎప్పుడూ వైసీపీలోకి రావాలని అనుకోలేదు. ఎంతో బతిమాలితేనే వచ్చాను.

నాకు సీటు ఇవ్వమని ఎవర్నీ ప్రాధేయపడలేదు. మీరు రావాలి, మీరు వస్తేనే మాకు సీట్లు పెరుగుతాయి అని బతిమాలారు. నరసాపురం టీడీపీ కంచుకోట అని, మీరే ఇక్కడ్నించి పోటీ చేయాలి అని అడిగితేనే వైసీపీలోకి వెళ్లాను. నేను కాబట్టే ఇక్కడ్నించి నెగ్గాను. జగన్ బొమ్మ పెట్టుకుని నెగ్గామని ఎమ్మెల్యేలు చెప్పుకోవచ్చు గాక, కానీ నా ప్రభావం వల్ల కూడా నరసాపురం ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలకు ఓట్లు పడ్డాయన్నది నిజం. గతంలో అనేక పర్యాయాలు వైసీపీ వాళ్లు రమ్మన్నా ఛీ కొట్టాను" అంటూ వివరించారు.
Raghurama Krishnamraju
PrasadaRaju
YSRCP
Narasapuram
Jagan
Andhra Pradesh

More Telugu News