Amit Shah: ఢిల్లీ ఆసుపత్రుల్లో బెడ్లు ఫుల్... రైలు కోచ్ లు కేటాయిస్తామన్న అమిత్ షా

Amit Shah assures railway coaches to corona hit Delhi
  • ఢిల్లీలో 36 వేలకు పైగా కరోనా కేసులు
  • వెయ్యి మందికిపైగా మరణం
  • నిత్యం కొత్త కేసులతో క్రిక్కిరిసిన ఆసుపత్రులు
  • బెడ్లు దొరక్క రోగుల ఇక్కట్లు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు 36 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,214 మంది మృత్యువాత పడ్డారు. నిత్యం వందల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తుండడంతో ఆసుపత్రులన్నీ క్రిక్కిరిసిపోయాయి. బెడ్లు ఖాళీ లేక రోగులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బయటి వారికి తాము వైద్యం చేయలేమని సీఎం చేతులెత్తేసే పరిస్థితి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ దయనీయ పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. దేశ రాజధానిలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఢిల్లీ ప్రజల రక్షణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. కరోనా రోగులకు పడకల కొరత దృష్ట్యా రైల్వే కోచ్ లు కేటాయిస్తున్నామని తెలిపారు. ఢిల్లీకి కేంద్రం 500 రైల్వే కోచ్ లను అందిస్తుందని వెల్లడించారు. రైల్వే కోచ్ ల ద్వారా 8 వేల బెడ్లు అందుబాటులోకి వస్తాయని అమిత్ షా వివరించారు. ఈ రైల్వే కోచ్ లో కరోనా రోగులకు అన్ని సదుపాయాలు ఉంటాయని అన్నారు. వచ్చే రెండ్రోజుల పాటు ఢిల్లీలో కరోనా టెస్టులు రెట్టింపు చేయాలని, మరో 6 రోజుల్లో మూడు రెట్లు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. దేశ రాజధానిలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
Amit Shah
Railway Coaches
Delhi
Corona Virus
Arvind Kejriwal

More Telugu News