India: జూన్ 15 తరువాత మరో లాక్ డౌన్?... వద్దేవద్దంటున్న రాష్ట్రాలివే!

No More Another Lockdown
  • శరవేగంగా విజృంభిస్తున్న మహమ్మారి
  • మళ్లీ లాక్ డౌన్ ఆలోచన సరికాదు
  • లాక్ డౌన్ ప్రకటించబోమంటున్న తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ
ఇండియాలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. లాక్ డౌన్ నిబంధనలను సడలించి, ఆర్థిక కార్యకలాపాలకు, దేవాలయాలను తిరిగి తెరిచేందుకు అనుమతించిన తరువాత, రోజువారీ కేసుల సంఖ్య తొలిసారిగా 12 వేల మార్క్ ను కూడా దాటేసింది. తొలి 100 కేసులు వచ్చిన తరువాత, మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరడానికి 64 రోజుల సమయం పట్టగా, ఆపై పక్షం రోజుల వ్యవధిలోనే రెండు లక్షలకు, ఆపై పది రోజుల్లోనే కేసుల సంఖ్య మూడు లక్షలను దాటేసింది. ప్రస్తుతం కేసుల సంఖ్య విషయంలో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 15 తరువాత మరోసారి లాక్ డౌన్ ను ప్రకటిస్తారని వార్తలు వస్తుండగా, కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ ఆలోచన సరికాదని అంటున్నాయి.

మరోసారి లాక్ డౌన్ ను ప్రకటించబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ బాలాసాహెబ్ థాకరే స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రజలు రద్దీ ప్రాంతాలకు వెళ్లవద్దని, ప్రభుత్వ సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కారు కూడా మరోసారి లాక్ డౌన్ ను వ్యతిరేకిస్తోంది. "లాక్ డౌన్ ను కొనసాగించాలని భావించడం లేదు" అని ఢిల్లీ వైద్య మంత్రి సత్యేందర్ జైన్ వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో తమిళనాడు సైతం మరోసారి లాక్ డౌన్ ను వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని, రూమర్లను వ్యాపించే వారిపై కఠిన చర్యలుంటాయని ముఖ్యమంత్రి పళనిస్వామి హెచ్చరించారు. తన పేరిట వాట్స్ యాప్ లో ఈ వార్త చక్కర్లు కొడుతోందని, అటువంటి నిర్ణయాలేమీ తాను తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలావుండగా, కేంద్రం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, అన్ లాక్ వ్యూహాల కారణంగానే ఇండియాలో కేసుల సంఖ్య పెరుగుతోందని లోక్ సభలో కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ ఊహల్లో నుంచి బయటకు వచ్చి వాస్తవాలను గ్రహించాలని ఆయన అన్నారు.
India
Lockdown
Tamilnadu
Maharashtra
New Delhi

More Telugu News