Hyderabad: ఇది నైరుతి సీజన్... కరోనాకు ఆ వ్యాధులు కూడా కలిస్తే కష్టమేనంటున్న హైదరాబాద్ డాక్టర్లు

Hyderabad doctors warns seasonal fevers would be fatal along with corona
  • నైరుతి రుతుపవనాలతో హైదరాబాదులో వర్షాలు
  • వర్షాకాల వ్యాధుల ముప్పు పొంచి ఉందన్న వైద్యులు
  • అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
నైరుతి రుతుపవనాలు సకాలంలో వచ్చేయడంతో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మామూలు సమయాల్లో అయితే ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం. కానీ, ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా, వర్షాకాలం రావడంతో డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు ఉనికి చాటనున్నాయి. దీనిపై హైదరాబాద్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధులు కూడా సోకితే తట్టుకోవడం చాలా కష్టమని హెచ్చరించారు.

అదనపు జాగ్రత్తలు తీసుకోకతప్పదని, ఈ సీజనల్ వ్యాధుల నుంచి ఎవరికి వారు రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శానిటైజేషన్, మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చని, కానీ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని వివరించారు. నివాసాల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు.

కిమ్స్ లో పల్మనాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ వి.రమణప్రసాద్ మాట్లాడుతూ, ఓ రోగికి కరోనాతో పాటు డెంగ్యూ కూడా సోకితే  అది ప్రాణాంతకమే అవుతుందని ఆందోళన వెలిబుచ్చారు. రోగి ఆరోగ్య పరిస్థితి కొద్దిసేపట్లోనే క్షీణిస్తుందని వివరించారు.

అపోలో ఆసుపత్రిలో సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ గా పనిచేస్తున్న డాక్టర్ ఆఫ్తాబ్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో రోగులు గందరగోళానికి గురవుతున్నారని, జ్వరం వచ్చిన వాళ్లను వారం రోజుల పాటు ఇంటి వద్దనే క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తున్నారని, ఒకవేళ ఆ జ్వరం డెంగ్యూ అయితే ఆ వారం రోజుల్లో పరిస్థితి ఎంత విషమిస్తుందో ఊహించలేమని అన్నారు. డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యాలతో పాటు కొవిడ్-19 లక్షణాల్లో జ్వరం కామన్ అని తెలిపారు.
Hyderabad
Doctors
Seasonal Deceases
Monsoon
Rains
Corona Virus

More Telugu News