Roja: ఇది ట్రైలర్ మాత్రమే.. అసలైన సినిమా ముందుంది: రోజా

Chandrababu and Lokesh also will go to jail says Roja
  • తప్పు చేసిన అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లాల్సిందే
  • చంద్రబాబు, లోకేశ్ కూడా జైలుకెళ్లే రోజులు దగ్గర పడ్డాయి
  • అరెస్ట్ కు, జగన్ కు సంబంధం లేదు
విజిలెన్స్ అధికారుల విచారణ మేరకే టీడీపీ నేత అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఏదో స్వాతంత్ర్య సమరయోధుడిని అరెస్ట్ చేసినట్టు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, ఆయనను కిడ్నాప్ చేశారని అంటున్నారని మండిపడ్డారు. ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా తెలియకుండా అచ్చెన్నాయుడు వ్యవహారం నడిపారని, పలానా కంపెనీతో ఎంఓయూ  చేసుకోవాలంటూ లెటర్ హెడ్ మీద సంతకాలు కూడా చేశారని చెప్పారు. రూ. 150 కోట్ల అవినీతి జరిగిందని ఆధారాలతో సహా రుజువైందని అన్నారు.

ఏడాది కాలంలో మీరు ఏం చేశారంటూ నారా లోకేశ్ తొడ కొట్టారని... ఇప్పుడు స్టార్ట్ అయిందని, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, అసలైన సినిమా ముందుందని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ కూడా కటకటాల వెనక్కి వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.

అచ్చెన్నను అరెస్ట్ చేస్తే బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారని గగ్గోలు పెడుతున్నారని, తప్పు చేసిన వారు బీసీనా, ఓసీనా అనేది ఉండదని... ఎవరైనా అనుభవించాల్సిందేనని రోజా చెప్పారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారిపై చర్యలు తీసుకునేందుకు జగన్ కట్టుబడి ఉన్నారని అన్నారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ కు, జగన్ కు సంబంధం లేదని... తప్పు చేశారని తేలడంతోనే ఏసీబీ అరెస్ట్ చేసిందని చెప్పారు. అచ్చెన్నాయుడు వంటి అవినీతి తిమింగలాలు జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు.
Roja
Jagan
YSRCP
Atchannaidu
Chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News