Telangana: శీలం రంగయ్య లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలి: గవర్నర్ కు లేఖ రాసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Telangana Congress leaders writes governor
  • రంగయ్య పోలీసుల కారణంగానే చనిపోయాడంటున్న కాంగ్రెస్ నేతలు
  • పోలీసులు తీవ్రంగా హింసించారని ఆరోపణ
  • రంగయ్య కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇప్పించాలని వినతి
పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామానికి చెందిన శీలం రంగయ్య అనే దళితుడ్ని పోలీసులే పొట్టనబెట్టుకున్నారని తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు ఆరోపిస్తున్నారు. వన్యప్రాణుల చట్టం కింద అరెస్ట్ చేసిన రంగయ్యపై పీడీ కేసు నమోదు చేసి తీవ్రంగా హింసించారని తెలిపారు. పోలీసుల దెబ్బలు తాళలేక రంగయ్య ఈ నెల 26న లాకప్ లో మరణించినట్టు అనుమానాలున్నాయని, పేదవాడైన రంగయ్య మృతిపై సీబీఐ దర్యాప్తు అవసరం అంటూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు లేఖ రాశారు.

రంగయ్య మరణంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయగా, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ను విచారణ అధికారిగా నియమిస్తూ కోర్టు ఓ కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చిందని వెల్లడించారు. అయితే తాము హైకోర్టు తీర్పును గౌరవిస్తామని పేర్కొన్న కాంగ్రెస్ నేతలు... ఇక్కడ పోలీసులే తప్పు చేసినందున,  మళ్లీ పోలీసులే విచారణ జరిపితే న్యాయం జరగదని భావిస్తున్నందున సీబీఐ విచారణ కోరుతున్నామని వారు తమ లేఖలో వివరణ ఇచ్చారు.

అంతేకాకుండా, రంగయ్య కుటుంబం పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం నుంచి రూ.50 లక్షల పరిహారం ఇప్పించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ట్విట్టర్ లో స్పందిస్తూ, ఈ వ్యవహారంలో న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటామని వెల్లడించారు. దళితులపై అరాచకాలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
Telangana
Congress
Uttam Kumar Reddy
Mallu Bhatti Vikramarka
Governor
Tamilisai Soundararajan

More Telugu News