TS High Court: కోర్టుల్లో లాక్ డౌన్ పొడిగింపు.. తెలంగాణ హైకోర్టు నిర్ణయం 

TS High Court extends lockdown in courts
  • హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కోర్టుల్లో లాక్ డౌన్ ఈనెల 28 వరకు పొడిగింపు
  • ఇతర జిల్లాల్లో ఈ నెల 14 వరకు పొడిగింపు
  • రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ను పొడిగించాలనే పిటిషన్ కొట్టివేత
లాక్ డౌన్ ను సడలించిన తర్వాత తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కోర్టుల్లో లాక్ డౌన్ ను ఈనెల 28 వరకు పొడిగించింది. అత్యవసర, తుది విచారణ కేసులను మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని ఆదేశించింది. ఇరువైపుల లాయర్లు ప్రత్యక్ష విచారణను కోరితే... జ్యూడీషియల్ అకాడమీలో ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.

జిల్లా, మేజిస్ట్రేట్, ట్రైబ్యునల్ కోర్టుల లాక్ డౌన్ ను ఈ నెల 14 వరకు హైకోర్టు పొడిగించింది. 15వ తేదీ నుంచి ఈ కోర్టులను తెరవాలని ఆదేశించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా... ఇతర జిల్లాలలోని కోర్టుల్లో నేరుగా పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. కోర్టుల వద్ద శానిటైజేషన్, మాస్కులు, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.

మరోవైపు రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో, జులై 15 వరకు పూర్తి లాక్ డౌన్ ను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ వేసిన పిల్ ను హైకోర్టు కొట్టి వేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని... ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని చెప్పింది.
TS High Court
Lockdown

More Telugu News