Chandrababu: నిండుగా ఉన్న చేపల చెరువుకు కొంగల గుంపును కాపలా పెట్టినట్టయింది: చంద్రబాబు
- రాష్ట్ర పరిస్థితిపై చంద్రబాబు ఆందోళన
- జైలుకు వెళ్లొచ్చిన వాళ్లకు అధికారం అప్పగించారని వ్యాఖ్యలు
- అవినీతికి హద్దు, అదుపు ఉంటుందా అంటూ వరుస ట్వీట్లు
- ఈ దోపిడీని ప్రజలే అడ్డుకోవాలని పిలుపు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ సర్కారుపైనా, సీఎం జగన్ పైనా తనదైన శైలిలో ధ్వజమెత్తారు. నిండుగా ఉన్న చేపల చెరువుకు కొంగల గుంపును కాపలా పెట్టినట్టుగా రాష్ట్ర పరిస్థితి తయారైందని ట్విట్టర్ లో స్పందించారు. వేల కోట్ల అవినీతి చేసిన, జైలుకు కూడా వెళ్లొచ్చిన వాళ్ల చేతికి అధికారం ఇస్తే అవినీతికి హద్దు, అదుపు ఉంటుందా అని ప్రశ్నించారు. సీఎం అయిన వెంటనే ఇసుకపై పడ్డారని విమర్శించారు. వచ్చీ రావడంతోనే టీడీపీ ఉచిత ఇసుక పాలసీ రద్దు చేసి రీచ్ లు అన్నింటినీ వైసీపీ శాండ్ మాఫియా పరం చేశారని ఆరోపించారు. 12 నెలల్లోనే 13 లక్షల టన్నుల ఇసుక మాయం చేశారని, గ్రావెల్, మట్టి కుంభకోణాల సంగతి సరేసరి అని వ్యాఖ్యానించారు. భూకబ్జాలకు అయితే అంతే లేదని తెలిపారు.
బ్లీచింగ్ కొనుగోళ్లలోనూ స్కాములు జరిగాయని వెల్లడించారు. బ్లీచింగ్ చల్లితే కరోనా పోతుందన్నారని, ఒక్క జిల్లాలోనే బ్లీచింగ్ కొనుగోళ్లలో రూ.75 కోట్ల కుంభకోణం జరిగిందంటే మిగిలిన జిల్లాల్లో ఏస్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చని పేర్కొన్నారు. ఇక, రూ.333 విలువ చేసే కరోనా కిట్ రూ.770కి కొనడం మరో కుంభకోణమని విమర్శించారు. పేదల పథకాల్లోనూ కుంభకోణాలేనని చంద్రబాబు మండిపడ్డారు.
ఇళ్ల స్థలాల ముసుగులో భూకొనుగోళ్ల పేరిట ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల కుంభకోణాలు చేశారని, ఆవ భూముల్లో రూ.400 కోట్లు స్కామ్ జరిగిందని ఆరోపించారు. దోచుకో-దాచుకో అన్న వైసీపీ అవినీతి విధానానికి తోడు గవర్నమెంట్ టెర్రరిజంతో అందరూ బెంబేలెత్తిపోతున్నారని పేర్కొన్నారు. వాటాలు ఇవ్వని పారిశ్రామికవేత్తలకు జె-ట్యాక్స్ వేధింపులు, మద్యం కంపెనీల నుంచి జె-ట్యాక్స్ వసూళ్లు, ఉద్యోగాలు అమ్ముకోవడం, జలాశయాల్లోని నీళ్లు అమ్ముకోవడం... ఇలా ఎన్నో ఉన్నాయని వివరించారు.
ఏడాది పాలనలోనే జగమేత ఇలా ఉంటే రాబోయేకాలంలో గజమేత ఎలా ఉంటుందోనని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దోపిడీని అడ్డుకోవాల్సింది ప్రజలేనని, ప్రజలకు టీడీపీ ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.