ED: ఐదుగురు ఈడీ ఉద్యోగులకు కరోనా... ప్రధాన కార్యాలయం మూసివేత

Five employs of ED tested corona positive
  • ఢిల్లీలో కరోనా విజృంభణ
  • ఈడీ ఆఫీసులో కరోనా కలకలం
  • వైరస్ సోకినవారిలో స్పెషల్ డైరెక్టర్, దర్యాప్తు అధికారి
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. తాజాగా ఐదుగురు ఈడీ ఉద్యోగులు కూడా కరోనా బారినపడినట్టు గుర్తించారు. వారిలో ఓ స్పెషల్ డైరెక్టర్ హోదా కలిగిన అధికారి, ఓ దర్యాప్తు అధికారి కూడా ఉన్నారు. కరోనా కలకలం నేపథ్యంలో ప్రధాన కార్యాలయాన్ని రెండ్రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు.

కాగా, కరోనా పాజిటివ్ అని తేలిన ఐదుగురిలో ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. ఖాన్ మార్కెట్ ఏరియాలో ఉన్న లోకనాయక్ భవన్ లోని ఇతర ఫ్లోర్లలో కరోనా కేసులు వెల్లడి కావడంతో, ఇదే భవనంలో ఉన్న ఈడీ ప్రధాన కార్యాలయంలోనూ కరోనా టెస్టులు చేపట్టారు. విభాగాల వారీగా కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా, ఈ ఐదు కేసులు వెలుగుచూశాయి.

పాజిటివ్ వచ్చిన ఉద్యోగులు ఎవరిలోనూ లక్షణాలు కనిపించకపోవడం అధికారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా సోకిన ఉద్యోగులను చికిత్స కోసం తరలించారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారికి క్వారంటైన్ విధించారు. ఇవాళ, రేపు ఈడీ ప్రధాన కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేసి సోమవారం తెరవనున్నారు.
ED
Employs
Corona Virus
Positive
New Delhi

More Telugu News