Chandrababu: చంద్రబాబు అవుట్ డేటెడ్.. లోకేశ్‌లో నో అప్‌డేట్: అంబటి విసుర్లు

YCP MLA Ambati fires on Chandrababu
  • చంద్రబాబుపై విరుచుకుపడిన అంబటి
  • ఆయన పాలన దోపిడీ మయం
  • జగన్ ఏడాది పాలనపై ప్రజల్లో సంతృప్తి
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేడు విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి టీడీపీలో ఆందోళన మొదలైందన్నారు. చంద్రబాబు రోజురోజుకు పతనమవుతున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లోకి దూసుకెళ్తున్నారని, ఆయన ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. దేశంలోని సీఎంలలో జగన్ నాలుగో స్థానంలో ఉన్నారన్నారు. టీడీపీది ప్రజా వ్యతిరేక పాలన కాబట్టే ఎన్నికల్లో ఆ పార్టీకి 23 స్థానాలే ఇచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ అయ్యారని, ఆయన వారసుడిగా లోకేశ్ అప్‌డేట్ కాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

తాము ఈ ఏడాది పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, వాటి కోసం రూ. 40,130 కోట్లను 3.57 కోట్ల లబ్ధిదారులకు అందజేసినట్టు చెప్పారు. చంద్రబాబు తన పాలనతో వేల కోట్లను గంగలో పోశారని, ఆయన పాలన మొత్తం దోపిడీ మయమని ఆరోపించారు. చంద్రబాబు ఏకంగా రూ. 15 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోయారన్నారు. ఆ బకాయిలు జగన్ తీర్చారన్నారు. చంద్రబాబు ఎన్ని జన్మలెత్తినా మళ్లీ అధికారంలోకి రాలేరని అన్నారు. న్యాయస్థానాలపై తమకు అపార గౌరవం ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో సుప్రీం ఆదేశాలను ప్రభుత్వం పాటిస్తుందని అంబటి స్పష్టం చేశారు. ఈ విషయంలో చంద్రబాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
Chandrababu
Ambati Rambabu
TDP
YSRCP

More Telugu News