Anagani Sathya Prasad: బాలినేనిని కలవలేదు.. టీడీపీని వీడటం లేదు: రేపల్లె అనగాని

Iam not leaving TDP says Anagani
  • చంద్రబాబు ప్రతి పోరాటం వెనక నేనున్నా
  • అందుకే నాపై ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు
  • బాబును మళ్లీ సీఎం చేయడానికి  కృషి చేస్తా
వైసీపీలో చేరబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలాంటి ప్రచారం జరగడం ఇది మూడోసారని చెప్పారు.

 తమ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రతి పోరాటంలో తాను ఉంటున్నానని... అందుకే తనపై కొందరు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. మార్చి 20 నుంచి నిన్నమొన్నటి వరకు తాను అసలు ఏపీలోనే లేనని చెప్పారు. తాను ఏపీలో ఉన్నానని కానీ, మంత్రి బాలినేనిని ఒంగోలులో కలిశానని కానీ రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. పార్టీ  మారాలని ఎంతో మంది అడుగుతుంటారని... అంత మాత్రాన పార్టీ మారుతున్నట్టు కాదని చెప్పారు.

మహానాడులో తాను కూడా పాల్గొన్నానని... తీర్మానం ప్రవేశపెట్టిన రోజున తన సోదరుడి పుట్టినరోజు ఉందని.. అందుకే ఆరోజు రాలేకపోయానని అనగాని తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని పార్టీ కార్యాలయానికి ముందుగానే ఇచ్చానని చెప్పారు. తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని అన్నారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Anagani Sathya Prasad
Telugudesam
Chandrababu
Balineni
YSRCP

More Telugu News