Vijayawada: విజయవాడలో యువకుడి కిడ్నాప్.. రూ. 4 లక్షల డిమాండ్.. పట్టేసిన పోలీసులు!

young man kidnapped in Vijayawada kidnappers demond 4 laksh
  • కృష్ణలంక వద్ద యువకుడి కిడ్నాప్
  • అడిగినంత ఇవ్వకుంటే చంపి కృష్ణా నదిలో పారేస్తామని బెదిరింపు
  • నలుగురు నిందితుల అరెస్ట్.. మహిళ కోసం గాలింపు
విజయవాడలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. నగరంలోని నిడమానూరుకు చెందిన రత్నశేఖర్ అనే యువకుడిని కృష్ణలంక వద్ద శనివారం రాత్రి కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి తాడేపల్లి మండలంలోని ప్రాతూరు కరకట్ట మార్గంలోని ఓ ఇంట్లో బంధించారు. అనంతరం అతడి తండ్రి వెంకట్రావుకు ఫోన్ చేసి రత్నశేఖర్‌ను కిడ్నాప్ చేశామని, వదిలిపెట్టాలంటే రూ. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడిగినంత ఇవ్వకుంటే చంపి కృష్ణా నదిలో పారేస్తామని బెదిరించారు.

భయపడిన వెంకట్రావు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. వెంకట్రావుతో కిడ్నాపర్లకు ఫోన్ చేయించి డబ్బులు పట్టుకుని ఎక్కడికి రావాలని అడిగించారు. కిడ్నాపర్లు నాలుగైదు ప్రదేశాల పేర్లు చెబుతూ ఇబ్బంది పెట్టారు. అయితే, అప్పటికే నిందితుల ఫోన్ నంబర్ల ఆధారంగా పోలీసులు వారిని ట్రేస్ చేశారు. మరోవైపు, కిడ్నాపర్లు ఫోన్ చేసి ప్రాతూరు కరకట్ట వద్దకు రావాల్సిందిగా వెంకట్రావుకు సూచించారు.

వారు చెప్పిన ప్రకారం అక్కడికి చేరుకున్న పోలీసులు రత్నశేఖర్‌ను కాపాడి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో తాడేపల్లికి చెందిన రౌడీ షీటర్లు శివకుమార్, సాయిరామ్, రాంబాబుతోపాటు సతీశ్‌, మరో మహిళ ఉన్నట్టు గుర్తించారు. నలుగురినీ అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న నిందితురాలి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.
Vijayawada
Guntur District
kidnap
Crime News

More Telugu News