Wedding: పెద్దపల్లి జిల్లాలో పెళ్లిపత్రికే మాస్కుగా మారిన వేళ..!

Marriage in Peddapalli district attracts attention
  • లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ పెళ్లి
  • పెళ్లికి వచ్చిన వారికి మాస్కుల పంపిణీ
  • మాస్కుపై వధూవరుల ఫొటోలు, పెళ్లి వివరాల ముద్రణ
కరోనా కట్టడి కోసం ప్రకటించిన లాక్ డౌన్ పెళ్లిళ్లు చేసుకునే వారి పాలిట ఎంతో కష్టంగా మారింది. బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే వీల్లేదు... భౌతికదూరం, ముఖానికి మాస్కులతో జరిగేది కూడా ఓ పెళ్లేనా అనుకుంటూ వాయిదా వేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, పెద్దపల్లి జిల్లా తొగర్రాయిలో ఓ జంట వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైంది. కొద్దిమంది అతిథులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.

విశేషం ఏంటంటే... ఈ పెళ్లికి వచ్చినవారందరికీ మాస్కులు పంపిణీ చేశారు. ఆ మాస్కులపై వధూవరుల ఫొటోలు, పెళ్లివివరాలు ముద్రించారు. ఏకంగా పెళ్లిపత్రికనే మాస్కుపైకి ఎక్కించారు. ఈ పెళ్లికి వచ్చిన అందరి ముఖాలకు ఈ తరహా మాస్కులు కనువిందు చేశాయి. వధూవరులు, పురోహితుడు సైతం ఈ మాస్కులనే ధరించారు. పెళ్లింటి వారి ప్రయత్నాన్ని గ్రామస్తులు, బంధుమిత్రులు అభినందించారు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే పెళ్లి చేసుకోవడం పట్ల అధికారులు కూడా హర్షం వ్యక్తం చేశారు.
Wedding
Peddapalli District
Masks
Lockdown
Corona Virus
Telangana

More Telugu News