Rajamouli: సినీ పరిశ్రమ పట్ల సీఎం కేసీఆర్ ఎంతో సానుభూతి ప్రదర్శించారు: రాజమౌళి

SS Rajamouli tweets about meeting with CM KCR
  • సీఎం కేసీఆర్ తో సమావేశమైన చిత్ర పరిశ్రమ ప్రముఖులు
  • తాము చెప్పింది సీఎం ఓపిగ్గా విన్నారన్న రాజమౌళి
  • తలసానికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్
లాక్ డౌన్ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ పునరుద్ధరణఫై టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, ఎన్.శంకర్, ఎస్.రాధాకృష్ణ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దీనిపై రాజమౌళి స్పందించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో తిరిగి సాధారణ పరిస్థితులను తీసుకువచ్చేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించామని, చిత్ర పరిశ్రమ పట్ల సీఎం కేసీఆర్ ఎంతో సానుభూతితో స్పందించారని రాజమౌళి వెల్లడించారు.

తాము చెప్పిన అంశాలను ఎంతో ఓపిగ్గా విన్నారని, ఊరట కలిగించేలా మాట్లాడారని తెలిపారు. త్వరలోనే చిత్ర పరిశ్రమ పునఃప్రారంభానికి తగిన విధానం రూపొందిస్తామని చెప్పారని, తాము ఎంతగానో ప్రేమించే సినిమాతో మళ్లీ మమేకం కానున్నామని రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. టాలీవుడ్ పరిస్థితిని సీఎంకు నివేదించడంలో తమకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విశేషంగా సాయపడ్డారని, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని రాజమౌళి ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
Rajamouli
KCR
Tollywood
Lockdown
Corona Virus

More Telugu News