Amazon: ఆన్ లైన్ షాపింగ్ కు పెరిగిన డిమాండ్... అమెజాన్ లో భారీగా తాత్కాలిక నియామకాలు

Amazon set to take temporary employs to enhance business
  • ఈ-కామర్స్ సైట్లపై తొలగిన ఆంక్షలు
  • కార్యకలాపాలు విస్తృతం చేయాలనుకుంటున్న అమెజాన్
  • కొత్తగా 50 వేల మందితో తాత్కాలిక నియామకాలు
లాక్ డౌన్ నేపథ్యంలో మారిన పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రణాళికలు రచిస్తోంది. దేశవ్యాప్తంగా షాపింగ్ మాళ్లు, డిపార్ట్ మెంటల్ స్టోర్లు తెరుచుకోకపోవడంతో ఆన్ లైన్ షాషింగ్ కు గిరాకీ ఏర్పడింది. ఈ పరిణామాన్ని పసిగట్టిన అమెజాన్ తన కార్యకలాపాలు మరింత విస్తృతం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు 50 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

కొత్తగా తీసుకునే ఉద్యోగులను అమెజాన్ ఫుల్ ఫిల్ మెంట్ కేంద్రాల్లోనూ, డెలివరీ నెట్వర్క్ కేంద్రాల్లోనూ నియమించనున్నట్టు అమెజాన్ వర్గాలు తెలిపాయి. తొలి దశ లాక్ డౌన్ లో ఈ-కామర్స్ కార్యకలాపాలు కూడా నిలిచిపోయినా, ఆపై దశల వారీగా ఆంక్షలు తొలగించడంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లు రెట్టించిన ఉత్సాహంతో కార్యక్షేత్రంలోకి దూకాయి.

కాగా, అమెజాన్ తాజాగా 'అమెజాన్ ఫుడ్' పేరిట ఆహార డెలివరీ విభాగాన్ని కూడా ప్రారంభించడం తెలిసిందే. స్విగ్గీ, జొమాటోలకు దీటుగా 'అమెజాన్ ఫుడ్' గుర్తింపు తెచ్చుకుంటుందని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ ఫుడ్ కార్యకలాపాలు బెంగళూరు వరకు పరిమితమైనా, క్రమంగా దేశంలోని ముఖ్య నగరాలకు విస్తరించనున్నారు.
Amazon
Online Shopping
Recruitment
Temporary
Lockdown
India

More Telugu News