Corona Virus: 24 గంటల వ్యవధిలో లక్ష కేసులు... కరోనా ఇప్పుడే వదిలిపోబోదంటున్న నిపుణులు!

Above One Lakh New Corona Cases in Last 24 Hours
  • 51.32 లక్షలకు పెరిగిన మొత్తం కేసులు
  • ఇప్పటివరకూ కోలుకున్నవారు 20 లక్షలకు పైగానే
  • 3.31 లక్షలను దాటిన మృతుల సంఖ్య
కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే ప్రపంచాన్ని వీడే పరిస్థితి కనిపించడం లేదు. రోజురోజుకూ మరింతగా బలపడుతూ విస్తరిస్తున్న వైరస్, గడచిన 24 గంటల్లో లక్ష మందికి సోకింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 51.32 లక్షలకు పెరిగింది.

 అమెరికాతో పాటు బ్రిటన్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాల్లో పరిస్థితి మరింత విషమంగా మారింది. నిన్న ఒక్కరోజులోనే కొత్త కేసుల సంఖ్య 1.06 లక్షలను దాటింది. వ్యాధి సోకినవారిలో ఇప్పటివరకూ 20 లక్షల మంది కోలుకున్నారని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలియజేశారు. తొలి కేసు వచ్చిన తరువాత ఒక్క రోజులో ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి.

కాగా, ఒక్క అమెరికాలోనే కరోనా వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలను దాటడం గమనార్హం.  బ్రెజిల్ లో మొత్తం కేసుల సంఖ్య 36 వేలు దాటగా, రష్యాలో కొత్తగా 8,849 కేసులు వచ్చాయి. కరోనా వైరస్ చైనాలో రూపు మార్చుకుందని ఇప్పటికే వార్తలు రాగా, జిలిన్ పట్టణంలో తాజాగా 130 కేసులు వచ్చాయి. ఇక్కడ మరోసారి లాక్ డౌన్ ను విధించారు.

ఇక, ఎటువంటి లక్షణాలు లేకుండా ఉన్నప్పటికీ, పరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్ సోకిన వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ ఉంది. చైనాలో 31 అసింప్టమాటిక్ కేసులు రాగా, అందులో 28 వూహాన్ లోనే నమోదుకావడం గమనార్హం. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా మరణాల సంఖ్య 3,31,880కి చేరుకుంది. వీటిల్లో అమెరికాలో 94,496, బ్రిటన్ లో 36,042, ఇటలీలో 32,486, ఫ్రాన్స్ లో 28,132, స్పెయిన్ లో 27,940, బ్రెజిల్ లో 19,148, బెల్జియంలో 9,186, జర్మనీలో 8,273, ఇండియాలో 3583 మంది మరణించారు.
Corona Virus
New Cases
India
Positive
WHO

More Telugu News