APSRTC: 436 మార్గాల్లో.. 1,683 బస్సులు.. ఏపీలో ప్రారంభమైన బస్సు సర్వీసులు

APSRTC Buses started their services from today
  • 50 శాతం మంది ప్రయాణికులతోనే బస్సులు
  • ప్రస్తుతానికి వర్తించని రాయితీలు
  • అత్యవసరమైతే తప్ప చిన్నారులు, వృద్ధులు రావొద్దంటున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆర్టీసీ సేవలు మొదలయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన బస్సులు ప్రయాణికులకు సేవలు అందించేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం 436 మార్గాల్లో 1,683 బస్సులు అంటే 17 శాతం బస్సులను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. ఈ బస్సులకు నిన్నటి నుంచే ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమైంది. చార్జీలు పెంచకున్నప్పటికీ 50 శాతం మందితోనే ఈ బస్సులను నడపనున్నారు. అయితే, ప్రయాణికులు బస్సెక్కాలంటే మాత్రం కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఆరోగ్యసేతు యాప్. ప్రతీ ప్రయాణికుడి వద్ద కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ ఉంటేనే బస్సులోకి అనుమతిస్తారు.

ఇక, ఈ బస్సులు ప్రస్తుతానికి ఓ బస్టాండు నుంచి మరో బస్టాండుకు మాత్రమే నడుస్తాయి. ఈ బస్సుల్లో ఎటువంటి రాయితీలు వర్తించవు. అవసరం అనుకుంటే ఏసీ బస్సులను నడుపుతామని, 26 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే అందులో ఉంచుతామని అధికారులు తెలిపారు. అటెండర్లు ఉండరని, దుప్పట్లు ప్రయాణికులే తెచ్చుకోవాల్సి ఉంటుందని అన్నారు.

ఇక 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బస్సుల్లో కండక్టర్లు ఉండరు. అన్ని బస్సులకు ఆన్‌లైన్‌లోనే టికెట్లు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. కౌంటర్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారు తమ పేరు, ఫోన్ నంబరు ఇవ్వడం తప్పనిసరి.
APSRTC
Andhra Pradesh
Lockdown

More Telugu News