Susmita Sen: ఎడిసన్ వ్యాధితో తన పోరాటం గురించి వివరించిన సుస్మితా సేన్

Susmita Sen reveals how she fought against Addison decease
  • 2014లో ఎడిసన్ వ్యాధి బారినపడ్డట్టు వెల్లడి
  • ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని వివరణ
  • నాన్ చాక్ ప్రాక్టీసుతో పెరిగిన ఆత్మస్థైర్యం
  • 2019 నాటికి స్వస్థత పొందానన్న సుస్మిత
శరీరంలో అడ్రినలిన్ గ్రంథులు తగినంతగా హార్మోన్లను ఉత్పత్తి చేయలేక కుంటుపడడాన్ని ఎడిసన్ వ్యాధిగా భావిస్తారు. ఇది ఎంతో అరుదైన వ్యాధి. దీన్నే నిస్సత్తువ వ్యాధిగా పిలుస్తారు. ఇలాంటి అరుదైన వ్యాధితో తీవ్ర పోరాటం చేశానని మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ వెల్లడించారు. 2014లో తాను ఎడిసన్ వ్యాధితో బాధపడ్డానని, శరీరంలో ఇమ్యూనిటీ పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో శరీరం మొత్తం నిస్సత్తువ ఆవహించేదని, కనీసం వ్యాధితో పోరాడగల శక్తి కూడా లేని స్థితిలో తీవ్ర యాతన అనుభవించానని వివరించారు. కంటి చుట్టూ నల్లని వలయాలతో రోగ గ్రస్తంగా మారిపోయానని, నాలుగేళ్ల పాటు తన పోరాటం కొనసాగిందని పేర్కొన్నారు.

ఎడిసన్ వ్యాధి నుంచి త్వరగా కోలుకునేందుకు కొన్ని స్టెరాయిడ్స్ తీసుకోవడంతో దుష్పరిణామాలు కలిగాయని, దాంతో జీవితంపై నిరాశ కలిగిందని, వ్యాధి ఇక ఎప్పటికీ తగ్గదేమోనని భావించానని తెలిపారు. కానీ, జీవితంపై అనురక్తితో తనను తాను పునరుజ్జీవం చేసుకోవాలని తలంచి, నాన్ చాక్ మార్షల్ ఆర్ట్ నేర్చుకుని ఎంతో మానసిక స్థైర్యం అందుకోవడంతోపాటు క్రమంగా ఆరోగ్యవంతురాలినయ్యానని సుస్మిత వెల్లడించారు.

2019 నాటికి ఎడిసన్ వ్యాధి ప్రభావం నుంచి కోలుకున్నానని వివరించారు. మన శరీరం గురించి మనకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదని, ఆరోగ్యంగా ఉండడం కోసం శరీరం చెప్పే మాట వినాలని సూచించారు.
Susmita Sen
Addison Decease
Former Miss Universe
India

More Telugu News