Um Pun: తీవ్ర తుపానుగా బలపడిన 'అమ్ పూన్'.... ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై గురి!

Cyclone in Bay of Bengal intensified into severe cyclonic storm
  • దూసుకువస్తున్న 'అమ్ పూన్'
  • మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం
  • మే 20న తీరం దాటుతుందని వాతావరణ విభాగం వెల్లడి
బంగాళాఖాతంలో ఏర్పడిన 'అమ్ పూన్' తుపాను ఈ సాయంత్రం తీవ్ర తుపానుగా మారింది. సముద్ర ఉపరితల వాతావరణం అనుకూలించడంతో శరవేగంతో బలపడుతున్న ఈ తుపాను ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం దిశగా దూసుకువస్తోంది. ఇది మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని, ఆపై ప్రచండ తుపానుగా బలపడి మే 20న తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది.

ప్రస్తుతం వాయవ్య దిశగా కదులుతున్న తీవ్ర తుపాను, ఆపై ఉత్తర దిశలో పయనిస్తుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. మే 20 సాయంత్రం పశ్చిమ బెంగాల్ లోని దిఘా, బంగ్లాదేశ్ లోని హాతియా ఐలాండ్స్ మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ఈ తీవ్ర తుపాను మరింత బలపడితే గాలుల వేగం గంటకు 190 కిలోమీటర్ల వరకు చేరుకుంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.

అయితే, ఈ తీవ్ర తుపాను తీరానికి దూరంగా, ఇంకా సముద్రంలోనే ఉన్నందున వర్షపాతం వివరాలపై మరింత స్పష్టత రాలేదు. ఒడిశా, బెంగాల్ లపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అటు తుపాను నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.
Um Pun
Amphan
Cyclone
Bay of Bengal
Odisha
West Bengal
NDRF
India

More Telugu News