Adrian Hill: కరోనా వ్యాక్సిన్ ధరపై ఆసక్తికర అంశాలు వెల్లడించిన ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్

Oxford University prof Adrian Hill speaks about corona vaccine price
  • కరోనా వ్యాక్సిన్ తయారీలో ఆక్స్ ఫర్డ్ వర్సిటీ ముందంజ
  • కోతులపై పరీక్షలు సఫలం
  • ప్రస్తుతం మానవులపై పరీక్షలు
యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి ధాటికి కకావికలం అవుతున్న తరుణంలో అందరి చూపు వ్యాక్సిన్ పైనే ఉంది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనా రక్కసి రెక్కలు కత్తిరించవచ్చని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నా, ఈ రేసులో అందరికంటే ముందున్నది ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీనే. ఈ వర్సిటీ పరిశోధకులు రూపొందించిన వ్యాక్సిన్ ను ఇప్పటికే కోతులపైనా ప్రయోగించి సత్ఫలితాలు రాబట్టారు. ప్రస్తుతం మానవులపై పరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్ ఆడ్రియన్ హిల్ ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

సాధ్యమైనంత విస్తృతస్థాయిలో వ్యాక్సిన్ ను అందించాలన్నది తమ లక్ష్యమని, ధర మరీ ఎక్కువ కాకుండా ఉండేందుకు వీలుగా భారీగా ఉత్పత్తి చేయాలని భావిస్తున్నామని తెలిపారు. తక్కువ ధరకు లభ్యమైతే వీలైనంత ఎక్కువమందికి చేరుతుందని, ఆ దిశగానే తమ పరిశోధనలు సాగుతున్నాయని హిల్ వివరించారు. ప్రయోగాలు కొనసాగుతున్నాయంటే ఇందులో నిరాశ కలిగించే అంశాలేవీ లేనట్టేనని భావించాలని పేర్కొన్నారు.

ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్ అని, ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో తయారుచేస్తాం కాబట్టి అన్ని దేశాలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. కాగా, ఈ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా 7 తయారీ కేంద్రాలకు మాత్రమే ఉందని ప్రొఫెసర్ హిల్ వెల్లడించారు. కాగా, ఆ ఏడింటిలో ఒకటి భారత్ లోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ కావడం విశేషం అని చెప్పాలి.
Adrian Hill
Corona Virus
Vaccine
Price
Oxford University

More Telugu News