Prakasam District: కరోనాను తరిమికొట్టిన తొలి జిల్లా ప్రకాశం... రోగులందరూ కోలుకుని డిశ్చార్జి 

Prakasham district registered zero corona cases
  • ప్రకాశం జిల్లాలో 63 మందికి కరోనా
  • అందరూ కోలుకున్న వైనం
  • లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసిన జిల్లా యంత్రాంగం
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో అత్యధిక కేసులు వచ్చిన జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా ఉంది. అయితే, జిల్లా యంత్రాంగం దృఢ సంకల్పంతో పనిచేసి కరోనా మహమ్మారిని విజయవంతంగా నియంత్రించింది. జిల్లాలో అత్యధికంగా 63 పాజిటివ్ కేసులు రాగా, మే 16 నాటికి అందరూ కోలుకుని డిశ్చార్జి అయ్యారు. జిల్లాలో ఇప్పుడు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. దాంతో కరోనా రోగులందరూ కోలుకుని డిశ్చార్జి అయిన తొలి జిల్లాగా నిలిచింది. ఏపీలో మరే జిల్లాలోనూ రోగులు మొత్తం డిశ్చార్జి అయింది లేదు.

వైద్య, పోలీసు, వలంటీర్ వ్యవస్థ ఎంతో సమన్వయంతో పనిచేసిన ఫలితమే జిల్లాలో జీరో పాజిటివ్ వచ్చిందని చెప్పాలి. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తమ సిబ్బందితో కలిసి తీవ్రంగా శ్రమించారు. గత కొన్నివారాల నుంచి ప్రకాశం జిల్లాలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అధికారులు లాక్ డౌన్ నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేయడం కూడా కరోనా వ్యాప్తిని కట్టడి చేసింది. అయినప్పటికీ ప్రకాశం జిల్లా అధికారులు పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచారు. జిల్లాలో కొత్త కేసులేవీ లేకపోయినా మరికొన్నాళ్లపాటు ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు.
Prakasam District
Corona Virus
Zero
Andhra Pradesh
COVID-19

More Telugu News