Andhra Pradesh: అమరావతిలో 'ఆర్ 5' జోన్ జీఓను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు!

AP High Court suspends R5 Zone Gazette notification 355
  • ఆర్5 జోన్ ను ప్రకటిస్తూ 355 గెజిట్ నోటిఫికేషన్  
  • నాలుగు వారాల పాటు సస్పెన్షన్
  • తదుపరి విచారణ జూన్ 17కు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆర్5 జోన్ ను ప్రకటిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ 355ను రాష్ట్ర హైకోర్టు నేడు సస్పెండ్ చేసింది. దీనిని నాలుగు వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. సీఆర్డీయే సెక్షన్ 41 ప్రకారం... రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయాలనుకుంటే... స్థానిక సంస్థలు, గ్రామ కమిటీల నుంచి అభిప్రాయాలను సేకరించాలని అమరావతి  రైతుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనను కూడా విన్న హైకోర్టు... ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది.

ఆర్5 జోన్ కింద రాజధానిలోని 29 గ్రామాల ప్రజలకే కాకుండా గుంటూరు, విజయవాడతో పాటు మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల వారికి కూడా ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు 1300 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. చట్టపరమైన ప్రక్రియ, నిబంధనలు పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని... సీఆర్డీయే సూత్రాలకు వ్యతిరేకంగా ప్రక్రియను చేపట్టిందని పిటిషన్ వేశారు.
Andhra Pradesh
YSRCP
R5 Zone
High Court

More Telugu News