Jagan: ప్రతి గ్రామ సచివాలయం పక్కన వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు చేస్తాం: సీఎం జగన్
- రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం
- రైతులు ప్రతిపంటను జనతా బజార్ల ద్వారా అమ్ముకోవచ్చని వెల్లడి
- జనతా బజార్లు రైతులకు ఉపయుక్తంగా ఉంటాయని వివరణ
ఏపీ సీఎం జగన్ రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, 2021 చివరికల్లా ప్రతి గ్రామ సచివాలయం పక్కన వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రైతులు పండించే ప్రతి పంటను అమ్ముకునేందుకు వైఎస్సార్ జనతా బజార్లు ఉపయుక్తంగా ఉంటాయని వివరించారు.
వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు రైతులు కష్టపడకుండా వైఎస్సార్ జనతా బజార్లు సరైన వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. అంతేకాకుండా, గ్రామ స్థాయిలోనే కోల్డ్ స్టోరేజి సదుపాయం కల్పించే స్థాయికి అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మున్ముందు రాష్ట్ర, జిల్లా స్థాయిలో వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేయనున్నామని, ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.