Super 30: 'సూపర్ 30' ఆనంద్ కుమార్‌కు కాలిఫోర్నియా వర్సిటీ నుంచి అరుదైన ఆహ్వానం

Super founder invited to virtually address students of UC Berkeley amidst Covid
  • కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించాలని ఆహ్వానం
  • విద్యార్థులకు సందేశమిచ్చి వారిలో ఉత్తేజాన్ని తిరిగి నింపాలని వినతి 
  • మే 16న ప్రసంగించనున్న ఆనంద్
  • 'సంక్షోభంలో అవకాశాలు' అంశంపై ప్రసంగం
కరోనా విజృంభణ నేపథ్యంలో బిహార్‌కు చెందిన 'సూపర్ 30' వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్‌కు అమెరికాలోని బెర్కలీ, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి అరుదైన ఆహ్వానం అందింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ విద్యార్థులకు సందేశం ఇచ్చి, వారిలో ఉత్తేజాన్ని తిరిగి నింపాలని ఆ వర్సిటీ కోరింది.

అమెరికాలో కరోనా విజృంభణతో ఇప్పటివరకు సుమారు 80 వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. లక్షలాది మందికి కరోనా సోకడంతో ఈ ప్రభావం విద్యా వ్యవస్థపై కూడా పడింది. దీంతో ఒత్తిడిలో ఉన్న విద్యార్థుల్లో తిరిగి ఆత్మ విశ్వాసం నింపడానికి బెర్కలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే  ప్రసంగించాలని ఆనంద్‌ కుమార్‌ను కోరింది.

మే 16న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించాలని బెర్కలీ ఇండియా ప్రతినిధి శుభం పరేఖ్ నుంచి ఆనంద్‌ కుమార్‌కు ఆహ్వానం అందింది. భారత్‌లో విద్యారంగంలో ఆనంద్‌ కుమార్‌ పాత్రను ఆయన కొనియాడారు. బెర్కలీ కాలిఫోర్నియా వర్సిటీ విద్యార్థులకు విలువైన సూచనలు ఇవ్వాలని ఆనంద్‌ను కోరుతున్నట్లు పేర్కొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించడానికి ఆనంద్ కుమార్ అంగీకరించారు. ప్రస్తుతం ఎందుర్కొంటున్న విపత్కర పరిస్థితుల్లో సానుకూల దృక్పథంతో ఉండాల్సిన అవసరం ఉందని కుమార్ చెప్పారు. తన విద్యార్థుల విజయగాథలను కాలిఫోర్నియా బెర్కలీ విద్యార్థులకు చెబుతానని అన్నారు. గడ్డు పరిస్థితుల్లోనూ తమను తాము నిరూపించుకోవడంలో వెనకాడని వారి ధైర్యాన్ని గురించి వివరిస్తానని చెప్పారు. 'సంక్షోభంలో అవకాశాలు' అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు.
Super 30
bihar
COVID-19

More Telugu News