Donald Trump: ప్రతిరోజు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటాను: డొనాల్డ్ ట్రంప్

US President Trump says will be tested for coronavirus daily
  • ట్రంప్ వ్యక్తిగత భద్రతాధికారికి కరోనా
  • శ్వేతసౌధంలో అందరికీ ప్రతి రోజు పరీక్షలు
  • ఇప్పటికే రెండుసార్లు ట్రంప్‌, మైక్‌ పెన్స్‌కు నెగిటివ్
తాను ఇకపై ప్రతిరోజు కరోనా వైరస్ పరీక్ష చేయించుకుంటానని అమెరికా అధ్యకుడు డొనాల్డ్‌ ట్రంప్ చెప్పారు. ట్రంప్‌కి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా పనిచేస్తోన్న అమెరికా మిలిటరీ అధికారి ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఇప్పటికే ట్రంప్‌తో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు కరోనా పరీక్షలు చేయగా వారిద్దరికీ నెగిటివ్ అని నిర్ధారణ అయింది.

ఈ నేపథ్యంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ... కరోనా సోకిన తన వ్యక్తిగత భద్రతా అధికారిని శ్వేతసౌధంలో తాను, మైక్ పెన్స్‌ అరుదుగా కలిసేవారమని చెప్పారు. ఆ అధికారి చాలా మంచివాడని వ్యాఖ్యానించారు. ఇప్పటికే తాను, మైక్‌ కరోనా పరీక్షలు చేయించుకున్నామని చెప్పారు. తాను, మైక్‌తో పాటు శ్వేతసౌధంలోని సిబ్బంది అందరం ఇకపై ప్రతి రోజు కరోనా వైరస్‌ పరీక్ష చేయించుకుంటామని తెలిపారు.

తాను నిన్న, ఈ రోజు పరీక్షలు చేయించుకున్నానని, రెండుసార్లూ నెగిటివ్‌ అని నిర్ధారణ అయిందని ట్రంప్ ప్రకటించారు. మైక్‌కి కూడా నెగిటివ్ అని తేలిందని చెప్పారు. ఇంతకు ముందు తాము వారానికి ఒకసారి కరోనా పరీక్షలు చేయించుకునేవారమని, ఇకపై ప్రతిరోజు చేయించుకుంటామని తెలిపారు.
Donald Trump
Corona Virus
COVID-19

More Telugu News