Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వేల మంది ప్రజలు... తలలు పట్టుకున్న అధికారులు!

Thousands of Migrants Rush to Secunderabad Railway Station
  • స్వస్థలాలకు చేర్చేందుకు రైళ్లు నడపాలని కేంద్రం ఆదేశం
  • సికింద్రాబాద్ స్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత
  • అన్ని గేట్లనూ మూసివేసిన అధికారులు
వలస కార్మికులు, వివిధ కారణాలతో లాక్ డౌన్ సమయంలో స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వారిని తమ తమ ప్రాంతాలకు చేర్చేందుకు ప్రత్యేక రైళ్లను నడిపించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించిన నేపథ్యంలో, అధికారులు, పోలీసులకు కొత్త సమస్య వచ్చి పడింది. తమ తమ గ్రామాలకు వెళ్లేందుకు రైళ్లు తిరుగుతాయన్న ఆలోచనలో ఉన్న వలస కార్మికులు, నిరుపేదలు పెద్ద సంఖ్యలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. నాంపల్లి, కాచిగూడ స్టేషన్ ల వద్ద కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది.

మరోవైపు ప్రభుత్వం అనుమతించిన రైళ్లు మినహా ప్యాసింజర్ రైళ్లను తిప్పే అవకాశాలు లేవని, వచ్చిన వారు వెనక్కు వెళ్లిపోవాలని రైల్వే శాఖ అధికారులు కోరుతున్నా, ఎవరూ వినిపించుకోకుండా, స్టేషన్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో, స్పందించిన పోలీసులు, స్టేషన్ కు వెళ్లేందుకు నాలుగు వైపులా ఉన్న దారులను మూసివేసి వచ్చిన వారికి సర్దిచెప్పి వెనక్కు పంపించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్, ఎవరూ స్టేషన్ పరిసరాల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.

కాగా, ఎవరినైనా స్వస్థలాలకు పంపాలంటే, అది ప్రభుత్వ అధికారుల నిర్ణయం మేరకే ఉంటుందని, స్టేషన్లలో టికెట్లు ఇవ్వబోమని, అసలు కౌంటర్లు కూడా తెరిచే పరిస్థితి లేదని రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు. స్టేషన్ కు వచ్చిన వారిని రైళ్లు ఎక్కేందుకు అనుమతించ బోమని, వారంతా తమతమ ప్రాంతాల అధికారులను సంప్రదించి, రైలు ప్రయాణానికి అవసరమైన అనుమతిని తీసుకోవాలని, ఏ రైలు ఎక్కాలన్న విషయాన్ని వారే తెలియజేస్తారని, సరైన పత్రాలు ఉంటేనే రైలు సమయానికి రెండు గంటల ముందు వైద్య పరీక్షలు చేసి అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. 
Secunderabad
Indian Railways
Station
Police
Migrants
Train

More Telugu News