Narendra Modi: కరోనా పరిస్థితులపై థాయ్ లాండ్ ప్రధానితో మాట్లాడిన నరేంద్ర మోదీ

PM Modi discusses corona issues with Thailand Prime Minister Prayut Chan
  • కరోనా పరిస్థితులపై అనేక దేశాల నేతలతో చర్చిస్తున్న మోదీ
  • తాజాగా థాయ్ ప్రధాని ప్రయుత్ చాన్ కు ఫోన్
  • ఇరు దేశాల్లో కరోనా పరిస్థితులపై చర్చ
కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతుండడంతో అనేక దేశాలు విలవిల్లాడుతున్నాయి. అగ్రదేశాలు, పేద దేశాలు అనే తేడాలేకుండా కొవిడ్-19తో తీవ్ర కష్టాల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అనేక దేశాలకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. తాజాగా థాయ్ లాండ్ ప్రధాని ప్రయుత్ చాన్ తో ఫోన్ లో మాట్లాడారు. దీనిపై మోదీ ట్వీట్ చేశారు.

"కొవిడ్-19 మహమ్మారికి సంబంధించిన అంశాలతో మిత్రుడు ప్రయుత్ చాన్ తో చర్చించాను. చారిత్రకంగా, సాంస్కృతికపరంగా సుదీర్ఘకాల సంబంధాలు కలిగిన ఇరుగుపొరుగు దేశాలుగా ప్రస్తుత సంక్షోభాన్ని, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఉత్పన్నమవుతున్న అనేక సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొంటాం" అని తెలిపారు.

కాగా, మోదీ, ప్రయుత్ చాన్ ఇరుదేశాల్లో అమలవుతున్న కరోనా నివారణ చర్యలను పరస్పరం అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంక్షుభిత సమయంలో ప్రాంతీయ సహకారం ఎంతో ప్రాధాన్యతాంశం అని మోదీ అభిప్రాయపడ్డారు. కరోనా నివారణ, పరిశోధకులు, శాస్త్రవేత్తల మధ్య సహకారం వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని ఇరుదేశాల నేతలు అభిలషించారు.
Narendra Modi
Prayut Chan
Thailand
Corona Virus
Pandemic
COVID-19

More Telugu News