Guddo: కిరాణా షాపుకెళ్లి సరుకులు తెమ్మంటే.. కోడల్ని తెచ్చి తల్లికి షాక్ ఇచ్చిన తనయుడు!

Went Out For Groceries and Returns With Wife
  • రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న గుడ్డూ
  • ఆపై లాక్ డౌన్ తో భార్యను ఢిల్లీలో ఉంచిన యువకుడు
  • వివాహాన్ని అంగీకరించేది లేదన్న గుడ్డూ తల్లి
కరోనా సమయంలో లాక్ డౌన్ అమలవుతున్న వేళ పక్కా సినీ పక్కీలో సాగిన లవ్ స్టోరీ ఇది. యూపీలోని ఘజియాబాద్ లో జరిగిన ఈ ఘటన పోలీసులూ విస్తుపోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడికి సమీపంలోని స‌హీదాబాద్ ‌కు చెందిన గుడ్డూ  అనే యువకుడు, రెండు నెల‌ల క్రితం స‌వితా అనే యువతిని ప్రేమించి, ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నాడు.

 అయితే, పెళ్లికి ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో మ్యారేజ్ సర్టిఫికెట్ లభించలేదు. దీంతో ఆమెను ఇంటికి తెచ్చుకోలేని పరిస్థితుల్లో గుడ్డూ ఉండిపోయాడు. ఈలోగా లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. భార్యను ఢిల్లీలోని ఓ అద్దె ఇంట్లో ఉంచి, తను మాత్రం ఇంట్లోనే ఉండిపోయాడు.

ఇటీవల గుడ్డూ తల్లి, కొట్టుకెళ్లి పచారీ సరుకులు తీసుకురావాలని కోరింది. ఇదే అదనుగా, ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. తాను వివాహం చేసుకున్న సవితను వెంటేసుకుని ఇంటికి వచ్చాడు. దీంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తల్లి, సవితను ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తే లేదంటూ, పోలీసులను ఆశ్రయించింది.

మొత్తం విషయం విని ఆశ్చర్యపోయిన పోలీసులు, లాక్ డౌన్ ముగిసేంత వరకూ సవితను ఢిల్లీలోని అద్దె ఇంట్లోనే ఉండాలని కోరి, ఆ మేరకు ఇంటి యజమానిని ఒప్పించారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత ఈ కేసును తేలుస్తామని చెప్పారు. 
Guddo
Uttar Pradesh
Marriage
Lockdown

More Telugu News