New zealand: కరోనా రౌండప్: తెరిపిన పడుతున్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా!

New Zealand and Australia are out from Corona Danger
  • న్యూజిలాండ్‌లో నిన్న మూడే కేసులు వెలుగులోకి
  • ఆసీస్‌లో నిన్న ఒకే ఒక్కరు మృతి
  • బ్రెజిల్, రష్యాలో ఆందోళనకర పరిస్థితులు
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌పై న్యూజిలాండ్ పై చేయి సాధించినట్టే కనిపిస్తోంది. మంగళవారం దేశవ్యాప్తంగా మూడు కేసులు మాత్రమే నమోదు కావడంతో దేశం మొత్తం ఊపిరి పీల్చుకుంది. తాజా కేసులతో కలుపుకుని దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 1,472కు పెరిగింది. కోవిడ్ కారణంగా ఇప్పటి వరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా, నిన్న ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. మరోవైపు, ఆస్ట్రేలియాలోనూ కరోనా ఉద్ధృతికి చెక్ పడింది. దేశంలో కొత్తగా 11 కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,731కి పెరిగింది. నిన్న ఒకే ఒక్కరు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 84కు పెరిగింది.

ఇక, ఇన్నాళ్లూ కరోనాతో అల్లాడిపోయిన అమెరికాలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా హాట్‌స్పాట్లుగా మారిన న్యూయార్క్, న్యూజెర్సీలో మరణాల రేటు బాగా తగ్గింది. ఫ్రాన్స్, స్పెయిన్‌లోనూ వైరస్ క్రమంగా నెమ్మదిస్తుండడంతో అమలులో ఉన్న నిషేధాజ్ఞలను దశలవారీగా సడలించాలని నిర్ణయించాయి.

బ్రెజిల్‌లో మాత్రం వైరస్ భయపెడుతోంది.  అక్కడ ఇప్పటి వరకు 67 వేల మందికిపైగా వైరస్ బారినపడగా, 4,600 మందికిపైగా మృత్యువాత పడ్డారు. దేశంలో పరిస్థితి ఇలా ఉంటే అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మాత్రం కరోనాను చిన్నపాటి ఫ్లూగా కొట్టిపడేయడం విమర్శలకు తావిచ్చింది. అమెరికా, ఐరోపా దేశాల్లో మాదిరిగా దేశంలో ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

ఫ్రాన్స్‌లోనూ పరిస్థితులు కొలిక్కి వస్తుండడంతో వచ్చే నెల 11 నుంచి పాఠశాలలను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, వైరస్ పూర్తిగా అదుపులోకి రాకముందే స్కూళ్లు తెరవడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రష్యాలో మాత్రం పరిస్థితులు కుదుటపడడం లేదు. దేశవ్యాప్తంగా వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే 450 మంది వైద్య సిబ్బంది కోవిడ్ బారినపడినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. వీరిలో 16 మంది మరణించినట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.
New zealand
Australia
Russia
France
COVID-19
Brazil

More Telugu News