Bonda Uma: రైతాంగాన్ని సర్వనాశనం చేశారు!: జగన్ పై బోండా ఉమ ధ్వజం
- రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
- రాష్ట్రంలో వరి ఎంత పండింది? ఎంత కొనుగోలు చేశారు?
- ధాన్యపు కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ఏపీ సీఎం జగన్ తీరు వల్లే రాష్ట్రంలో ‘కరోనా’ కేసులు ఎక్కువయ్యాయని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. ‘కరోనా’ కిట్ల కొనుగోలులో అవినీతి జరిగిందని, ఒక్కొక్క కిట్ కు పక్క రాష్ట్రం రూ.300కు వెచ్చించి కొనుగోలు చేసిందని, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.700 ఖర్చు చేసిందని విమర్శించారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రైతుల కోసం జగన్ చేపట్టిన చర్యలు ఏంటో చెప్పాలి? అని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో యాభై లక్షల టన్నుల పైచిలుకు ధాన్యం పండితే కనీసం రెండు లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం డబ్బు చెల్లించలేదని ధ్వజమెత్తారు. రైతాంగాన్ని సర్వనాశనం చేశారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో వరి ఎంత పండింది? ఈ ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసింది? కొనుగోలు చేసిన వరి పంటకు ఎంత డబ్బు చెల్లించారు? అని ప్రశ్నించారు. ధాన్యపు కొనుగోళ్లపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.