Chandrababu: ఏపీ ప్రజలకు చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ.. కీలక వ్యాఖ్యలు

chandrababu fires on ap govt

  • వారం రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి 
  • వైసీపీ నేతల నిర్లక్ష్యం వల్లే కరోనా వైరస్‌ వ్యాప్తి  
  • జగన్‌ చేస్తోన్న వ్యాఖ్యలు ప్రజలను ఆవేదనకు గురి చేస్తున్నాయి
  • మద్యం విక్రయాలు జరుగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పెనం పై నుంచి పొయ్యిలోకి నెట్టిందని ఆయన అందులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయని తెలిపారు.

కరోనా తీవ్రతను గురించి తాము ప్రభుత్వాన్ని ముందు నుంచే హెచ్చరిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. వైసీపీ నేతల నిర్లక్ష్యం వల్లే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని ఆయన ఆరోపించారు. కట్టడి ప్రాంతాల్లోనూ వైసీపీ నేతలు నిబంధనలు పాటించట్లేదని ఆయన విమర్శించారు.
 
కరోనా విపత్కర సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ చేస్తోన్న వ్యాఖ్యలు ప్రజలను ఆవేదనకు గురి చేస్తున్నాయని ఆయన విమర్శించారు. వలస కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందని చంద్రబాబు అన్నారు. కూలీలు తమ సొంత గ్రామాలకు చేరేందుకు వందల కిలోమీటర్లు నడవడం చూస్తుంటే మనసు కలిచివేస్తోందని ఆయన చెప్పారు.

భవన నిర్మాణ కార్మికులు, చేతి వృత్తులు, ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయారని ఆయన అన్నారు. రైతులు తమ పంటలను పొలంలో, రోడ్డు మీద వదిలేస్తున్నారని చంద్రబాబు నాయుడు తెలిపారు. పంట ఉత్పత్తులు కొనాలని తాము అడిగామని, మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కోరామని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులను ఆదుకోవాలని తాము చాలా లేఖలు రాశామని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని తెలిపారు. కరోనా కట్టడి కంటే స్థానిక ఎన్నికలే ముఖ్యంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News