Madhya Pradesh: కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నందుకు.. వైద్య సిబ్బంది, పోలీసులపై రాళ్లతో దాడి

Cop injured as locals attack police
  • మధ్యప్రదేశ్‌లోని షోపూర్ జిల్లాలో ఘటన
  • ఇండోర్ నుంచి గ్రామానికి చేరుకున్న యువకుడు
  • యువకుడి కుటుంబ సభ్యుల దాడిలో ఎస్సై తలకు తీవ్ర గాయం
కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాలన్నందుకు పోలీసులు, వైద్య సిబ్బందిపై ఓ యువకుడి కుటుంబ సభ్యులు దాడికి దిగారు. మధ్యప్రదేశ్‌లోని షోపూర్ జిల్లా గాస్వాని గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన గోపాల్ శివ్‌హరే అనే 21 ఏళ్ల యువకుడు ఇటీవల ఇండోర్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. కరోనాకు ఇండోర్ హాట్‌స్పాట్‌గా మారిన నేపథ్యంలో అక్కడి నుంచి యువకుడు వచ్చాడన్న విషయం తెలియడంతో  వైద్యులు గ్రామానికి చేరుకున్నారు. గోపాల్ ఇంటికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. అందుకు వారు ససేమిరా అన్నారు. గోపాల్ బాగానే ఉన్నాడని, అతడికి కరోనా వైరస్ సోకలేదని పరీక్షలు చేయించుకోనిచ్చేది లేదని అతడి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. అక్కడితో ఆగక వారిపై దాడిచేశారు.

దీంతో వైద్యాధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు గోపాల్ ఇంటికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినిపించుకోని గోపాల్ కుటుంబ సభ్యులు పోలీసులపైనా రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు పోలీసులు, వైద్య సిబ్బందికి గాయాలయ్యాయి. ఎస్సై శ్రీరాం అవస్థి(52) తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, వైద్య సిబ్బందిపై దాడిచేసిన గోపాల్ కుటుంబంపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Madhya Pradesh
Indore
shopore
Corona Virus
Police

More Telugu News