Telangana: సూర్యాపేటలో కరోనా కేసుల ఉద్ధృతి.. సీఐపై బదిలీ వేటు!

Suryapeta CI Transferred to Nagarkurnool
  • జిల్లాలో నేడు మరో మూడు కేసులు వెలుగులోకి
  • ఒక్క సూర్యాపేటలోనే 54 కేసులు
  • సీఐని నాగర్‌కర్నూలుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు
కరోనా కేసులతో సూర్యాపేట ప్రమాదకరంగా మారుతోంది. నేడు కొత్తగా మరో మూడు కేసులు వెలుగు చూశాయి. దీంతో జిల్లాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 83కి చేరుకోగా, ఒక్క సూర్యాపేట పట్టణంలోనే 54 కేసులు నమోదైనట్టు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.

పట్టణంలోని కూరగాయల మార్కెట్ ప్రాంతంలో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారులు సకాలంలో చర్యలు తీసుకోలేకపోయారంటూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా సూర్యాపేట డీఎంహెచ్‌వో నిరంజన్, డీఎస్పీ నాగేశ్వరావులను బదిలీ చేసిన ప్రభుత్వం, తాజాగా పట్టణ సీఐ శివశంకర్‌ను నాగర్‌కర్నూలుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోపక్క, సూర్యాపేట కొత్త డీఎంహెచ్‌వోగా సాంబశివరావు, డీఎస్పీగా మోహన్ కుమార్ బాధ్యతలు చేపట్టగా, సీఐ శివశంకర్ స్థానంలో హైదరాబాద్‌కు చెందిన అధికారి బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం.
Telangana
Suryapet District
Corona Virus

More Telugu News