Corona Virus: నిన్నటి వరకూ అందరి డాక్టర్... నేడు అంత్యక్రియలకు నోచుకోని అనాధ మృతదేహం!

Famous Doctor Died with Corona
  • హైదరాబాద్, ఏసీ గార్డ్స్ లో పేరున్న యునానీ వైద్యుడు
  • ఈ నెల 11న అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిక
  • కరోనా సోకి మంగళవారం నాడు మృతి
  • ఇంట్లోని వారందరికీ సోకిన వ్యాధి
  • అంత్యక్రియలకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు

ఆయన ఓ పేరుపొందిన యునానీ వైద్యుడు. 52 ఏళ్ల వయసులో ఎంతో చురుకుగా పనిచేస్తూ, తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థతను చేకూరుస్తారన్న మంచి పేరును తెచ్చుకున్నారు. హైదరాబాద్ లోని ఏసీ గార్డ్స్ ప్రాంతంలో క్లినిక్ ను నడుపుతున్న అతని వద్దకు నాంపల్లి, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల నుంచి నిత్యమూ ఎంతో మంది వచ్చి పోతుంటారు.

అంతటి పేరున్న డాక్టర్, కరోనా కారణంగా మరణిస్తే, అంత్యక్రియలు చేసేందుకు నా అన్నవారు రాలేని దురవస్థ ఏర్పడింది. ఈ విషాదకర ఘటన అగాపురా పరిధిలో జరుగగా, తమ డాక్టర్ మరణించారన్న విషయం తెలుసుకున్న ప్రజలు, కన్నీరు పెట్టడం మినహా మరేమీ చేయలేని పరిస్థితి.

ఈ నెల 11వ తేదీన ఊపిరి పీల్చుకోవడంలో ఆ డాక్టర్ ఇబ్బంది పడుతూ ఉండటంతో, తొలుత నాంపల్లి ఆసుపత్రికి, ఆపై బంజారాహిల్స్ లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 13న ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో, వెంటనే ఆయన్ను, ఆయన కుటుంబీకులను గాంధీ ఆసుపత్రికి తరలించగా, ఇంట్లోని మిగతా వారందరికీ కరోనా సోకినట్టు తేలింది.

 అతని భార్య, తల్లి, సోదరి, సోదరుడు... ఇలా ఇంట్లోని అందరూ వ్యాధి బారిన పడ్డారు. చికిత్స పొందుతున్న వైద్యుడు, మంగళవారం నాడు మరణించగా, కుటుంబీకులు గాంధీలోని ఐసొలేషన్ వార్డులో, బంధువులంతా హోమ్ క్వారంటైన్ లో ఉండటంతో, వారు అంత్యక్రియలు నిర్వహించే వీలు లేకపోయింది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బందే ఆయన్ను ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాము ఎంతగానో అభిమానించే వైద్యుడికి ఇలా అంత్యక్రియలు జరగడాన్ని ఊహించుకోలేకున్నామని పలువురు విలపించారు.

  • Loading...

More Telugu News