FDI: పెట్టుబడుల విషయంలో చైనా అభ్యంతరాలపై స్పందించిన భారత ప్రభుత్వం

New FDI Rules Not Violation Say Government Sources On China Criticism
  • విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో చైనా అభ్యంతరాలు
  • నిబంధనలు ఉల్లంఘించలేదన్న భారత్‌
  • వాటి అనుమతి పద్ధతులను మాత్రమే మార్చామని వివరణ
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విషయంలో భారత్‌ కొత్త నిబంధనలను ప్రకటించి, నిర్దిష్ట దేశాల నుంచి ఎఫ్‌డీఐలు రాకుండా కట్టుదిట్టమైన నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా అభ్యంతరాలు కూడా తెలిపింది. ఇటువంటి నిబంధనలు పెట్టడం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలను ఉల్లంఘించడమేనని చైనా హెచ్చరిస్తూ ప్రకటన చేసింది. జీ20 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఇండియా చర్యలు వ్యతిరేకమని చైనా వాపోయింది. అయితే, చైనా చేసిన వ్యాఖ్యల పట్ల భారత్‌ స్పందించి దీటుగా సమాధానం ఇచ్చింది.

తాము తీసుకొచ్చిన కొత్త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో ఎలాంటి ఉల్లంఘనలు లేవని భారత్‌ స్పష్టం చేసింది. తాము తీసుకొచ్చిన నిబంధనలు పొరుగున ఉన్న దేశాల ప్రత్యక్ష పెట్టుబడులను పూర్తిగా అడ్డుకోబోవని, వాటి అనుమతి పద్ధతులు మాత్రమే మారతాయని తెలిపింది. కాబట్టి ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది.

కాగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో భారత్ తీసుకొచ్చిన మార్పులు సరికాదని నిన్న చైనా మండిపడ్డ విషయం తెలిసిందే. భారత నిర్ణయం వివక్ష పూరితమంటూ, ఇది స్వేచ్ఛా వాణిజ్యానికి వ్యతిరేకమంటూ పలు అభ్యంతరాలు తెలిపింది. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని హెచ్చరిక చేసింది.

భారత్‌ తెచ్చిన మార్పుల ప్రకారం సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన సంస్థలు మన దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఇప్పటికే కొన్ని దేశాలపై భారత్ గతంలోనే ఇటువంటి ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఆ జాబితాలో చైనాను కూడా చేర్చింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే భారత్‌లోకి ప్రవేశించే అవకాశం చైనా సంస్థలకు ఉండేది.
FDI
China
India
Lockdown

More Telugu News