Jagan: ర్యాపిడ్ టెస్టు కిట్లను అధిక ధరలకు కొనుగోలు చేశారన్న ఆరోపణలపై సీఎం జగన్ స్పందన

CM Jagan clarification about Rapid test kits prices
  • ర్యాపిడ్ కిట్లు ఎక్కడ దొరికినా కొనుక్కోమని కేంద్రం చెప్పింది
  • ఐసీఎంఆర్ అనుమతినిచ్చిన కంపెనీకే ఆర్డర్ ఇచ్చాం
  • రూ.65 తక్కువకు మేము ఆర్డర్ చేశాం
ఏపీలో ర్యాపిడ్ టెస్టు కిట్లను ఎక్కువ ధరలకు కొనుగోలు చేశారంటూ వస్తున్న ఆరోపణలపై సీఎం జగన్ స్పందించారు. ర్యాపిడ్ కిట్లు ఎక్కడ దొరికినా కొనుక్కోమని కేంద్రం చెప్పిందని, ఐసీఎంఆర్ అనుమతిచ్చిన కంపెనీకే రాష్ట్రం ఆర్డర్ ఇచ్చిందని చెప్పారు. ఒక్కో కిట్ ను రూ.795కు కొనుగోలు చేయాలని ఐసీఎంఆర్ ఆర్డర్ ఇచ్చిందని, అది తెలిసినా కూడా రూ.65 తక్కువకు తాము ఆర్డర్ చేశామని చెప్పారు.

ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు పర్చేజ్ ఆర్డర్ లో అధికారులు ఓ షరతు పెట్టారని, ఇవే కిట్లను తక్కువ ఖర్చుకు ఎవరికైనా అమ్మితే దాని ప్రకారమే చెల్లిస్తామని చెప్పారని, ఇప్పటి వరకూ 25 శాతం మాత్రమే చెల్లింపులు జరిగాయని తెలిపారు.

తాము ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ కిట్స్ బయట దేశంలో తయారయ్యాయని, అదే సంస్థకు మన దేశంలో తయారీకి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చాక రేటు తగ్గిందని వివరించారు. రాష్ట్రం పెట్టిన షరతుల వల్ల ర్యాపిడ్ టెస్టు కిట్ల రేట్లు కూడా తగ్గబోతున్నాయని, వాటి ధరలు తగ్గించేందుకు తయారీ సంస్థ కూడా ఒప్పుకుందని అన్నారు. చాలా నిజాయతీగా ర్యాపిడ్ టెస్టు కిట్లు ఆర్డర్ చేశామని, ప్రజాధనం కాపాడే ఆలోచన చేసిన వైద్య శాఖకు అభినందనలు తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు.
Jagan
YSRCP
Corona Virus
Rapid Test kits
ICMR

More Telugu News