China: చైనాలో కరోనాపై ఎలుగెత్తిన ప్రజావేగులు అంతుచిక్కని రీతిలో అదృశ్యం!

Missing and arrests in China who whistleblows about corona
  • చైనాలో కరోనా విలయం
  • ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారి పరిస్థితిపై ఆందోళన
  • అదృశ్యాలు, అరెస్టులు!
చైనాలోని వుహాన్ నగరంలో జన్మించిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మానవాళి పాలిట మహమ్మారిలా పరిణమించింది. కొన్నినెలలుగా చైనాలో కరోనా విలయం సృష్టిస్తున్నా, బయటి ప్రపంచానికి తెలిసిన వివరాలపై ఎవరికీ నమ్మకం కుదరట్లేదు. ఇటీవలే వుహాన్ లో మృతుల సంఖ్యకు సవరణలు చేసినప్పటి నుంచి చైనా తీరు మరింత సందేహాస్పదంగా మారింది.

 ఇక అసలు విషయానికొస్తే... చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై అనేక ఆరోపణలున్నాయి. కరోనా సమయంలో అవి మరింత బహిర్గతమయ్యాయి. ఈ వైరస్ గురించి పబ్లిగ్గా ఎలుగెత్తిన అనేకమంది విజిల్ బ్లోయర్స్ (ప్రజావేగులు) అదృశ్యం కావడమో, అరెస్ట్ కావడమో జరిగింది. ఇలాంటి అనూహ్య అదృశ్యాలపై చైనా పెదవి విప్పడంలేదు.

కరోనా గురించి మొట్టమొదటిసారిగా హెచ్చరించిన డాక్టర్ వెన్ లియాంగ్ ఎప్పుడో కడతేరిపోయాడు. ఈ 34 ఏళ్ల యువ వైద్యుడు కరోనా వైరస్ తీవ్రతను మొదట్లోనే గుర్తించి తన సహచర వైద్యులను సోషల్ మీడియా ద్వారా అప్రమత్తం చేశాడు. దాంతో పోలీసులు ఆ వైద్యుడితో సోషల్ మీడియా నియమోల్లంఘన పత్రంపై బలవంతంగా సంతకం చేయించుకున్నారు. ఆశ్చర్యకరంగా చివరికి ఆ వైద్యుడు కరోనాకే బలయ్యాడు.

డాక్టర్ వెన్ లియాంగ్ మరణానికి ఒక్కరోజు ముందు న్యాయవాది చెన్ కియుషి కనిపించకుండా పోయాడు. వుహాన్ లోని ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లు ఎక్కడికక్కడ నేలపై పడిపోయి ఉన్న వీడియోలను చెన్ కియుషి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అతడి ఆచూకీపై సమాచారం లేదు.

ఇక లి జెహువా అనే 25 ఏళ్ల మీడియా రిపోర్టర్ ది ఓ వింత కథ. వుహాన్ లో కరోనా పరిస్థితులపై లైవ్ ఇచ్చిన ఆ యువ పాత్రికేయుడు చివరికి తన అరెస్టును తానే లైవ్ లో చూపించుకోవాల్సి వచ్చింది. సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు అతడి ఫ్లాట్ కు వచ్చి అరెస్ట్ చేశారు. ఆపై అతడి ఆనుపానులు తెలియరాలేదు. చైనా ప్రభుత్వం ఇలాంటి అరెస్టులు, అదృశ్యాలపై స్పందించలేదు. దాంతో కరోనాపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారందరినీ ఓ రహస్య విచారణ స్థలానికి తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
China
Corona Virus
COVID-19
Missing
Arrest

More Telugu News