USA: కరోనా మృతుల సంస్మరణ ప్రకటనల కోసం 15 పేజీలు కేటాయించిన వార్తాపత్రిక!

Boston Globe allocates fifteen pages for obituaries who died of corona
  • కరోనాతో విలవిల్లాడుతున్న అమెరికా
  • నివాళుల ప్రకటనలతో నిండిపోతున్న దినపత్రికలు
  • బోస్టన్ లోనే ఇలావుంటే న్యూయార్క్ లో ఇంకెలా ఉంటుందోనన్న పౌరులు
ఎవరైనా చనిపోయినప్పుడు వారి సంబంధీకులు, మిత్రులు దినపత్రికల్లో సంస్మరణ ప్రకటనలు ఇవ్వడం తెలిసిందే. స్మృత్యంజలి, శ్రద్ధాంజలి పేరిట దినపత్రికల్లో మృతులకు నివాళులు అర్పిస్తుంటారు. అలాంటివి సాధారణంగా పేపర్ లో ఏదో ఒక మూలన దర్శనమిస్తుంటాయి. కొందరు ధనికులు తమ స్థాయికి తగ్గట్టు భారీగా ప్రకటనలు ఇస్తుంటారు. అయితే, అమెరికాలోని ప్రముఖ 'ది బోస్టన్ గ్లోబ్' దినపత్రికలో ఆదివారం వచ్చిన సంస్మరణ ప్రకటనలు చూస్తే మతిపోతుంది. మరణించినవారి స్మృత్యంజలి వివరాలతో ఆ న్యూస్ పేపర్లో ఏకంగా 15 పేజీలు కేటాయించాల్సి వచ్చింది. దీనికంతటికీ కారణం కరోనా వైరస్.

అమెరికాలో కరాళ నృత్యం చేస్తున్న వైరస్ మహమ్మారి మసాచుసెట్స్ లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు అక్కడ 36 వేల కేసులు నమోదు కాగా, 1500 మంది వరకు మృత్యువాత పడ్డారు. దాంతో దినపత్రికల్లో సంస్మరణ ప్రకటనల కోసం అధిక పేజీలు కేటాయించాల్సి వస్తోందట. ఇదే పేపర్ లో గత ఆదివారం నాటి సంచికలో కూడా 11 పేజీలు మృతుల కోసం ప్రత్యేకంగా ప్రచురించారు.

దీనిపట్ల మసాచుసెట్స్ రాజధాని బోస్టన్ లోని ప్రజలు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితంలో ఓ న్యూస్ పేపర్ లో ఇన్ని సంస్మరణ ప్రకటనలు ఎప్పుడూ చూడలేదంటున్నారు. ఇక్కడే ఇలా ఉంటే, కరోనా ఉద్ధృతంగా ఉన్న న్యూయార్క్, న్యూజెర్సీల్లో దినపత్రికలు ఇంకెలా ఉంటాయో ఊహించలేకపోతున్నామని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
USA
Obituary
News Paper
Boston Globe
Corona Virus

More Telugu News