E-Commerce: ఈ-కామర్స్ విక్రయాలపై కేంద్రం వెనక్కితగ్గడానికి కారణం ఇదేనా..?

Centre denied access to sale non essential goods in ecommerce sites
  • ఈ-కామర్స్ సైట్లలో అమ్మకాలపై ప్రధాని జోక్యం కోరిన సీఏఐటీ
  • ఎలక్ట్రానిక్స్ విక్రయాలు కుదరవంటూ కేంద్రం తాజా ప్రకటన
  • కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన సీఏఐటీ
కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి లాక్ డౌన్ నిబంధనలను కాస్త సడలించే ప్రయత్నాలు చేస్తోంది. అనేక కార్యకలాపాలకు ఆమోదం తెలిపింది. అయితే ఈ-కామర్స్ సైట్లలో ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువుల అమ్మకాలు కుదరదని తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. గత ప్రకటనలో, ఈ-కామర్స్ పోర్టళ్లు ఎలక్ట్రానిక్స్ వస్తువుల విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇచ్చింది. తాజా మార్గదర్శకాల్లో మాత్రం వాటికి అనుమతి లేదంటూ స్పష్టం చేసింది. దీనికి కారణం అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) అని తెలుస్తోంది.

ఈ-కామర్స్ సైట్ల ద్వారా ఇతర వస్తువుల అమ్మడంపై జోక్యం చేసుకోవాలంటూ సీఏఐటీ ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. ఈ పరిణామం తర్వాతే కేంద్రం తాజా ప్రకటన చేస్తూ ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువుల అమ్మకాలపై యూటర్న్ తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సీఏఐటీ జాతీయ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ స్పందిస్తూ, కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఇతర వస్తువులను కూడా విక్రయించాలన్న ఈ-కామర్స్ వెబ్ సైట్ల దురుద్దేశపూర్వక ప్రణాళికలను సీఏఐటీ ఖండిస్తోందని అన్నారు.  ఈ విషయంలో తాము హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పారు.

అంతకుముందు, ఇదే అంశంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా హోంమంత్రిత్వశాఖకు లేఖ రాశారు. లేఖలు, విజ్ఞాపనలు అన్నింటినీ పరిగణలోని తీసుకున్న కేంద్రం ఈ-కామర్స్ పోర్టళ్ల విక్రయాలకు తాత్కాలికంగా కళ్లెం వేసింది.
E-Commerce
Amazon
Flipkart
CAIT
India
Lockdown

More Telugu News