Maharashtra: మహారాష్ట్రలో కేసులు 3,651కి చేరినప్పటికీ రేపటి నుంచి లాక్‌డౌన్‌ సడలింపులు.. సీఎం ఉద్ధవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

  • రేపటి నుంచి రాష్ట్రంలో పలు ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తాం
  • మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం
  • రానున్న రోజుల్లో కరోనా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది
  • రాష్ట్రంలోని వలస కూలీలు బాధపడొద్దు
coronavirus cases in maharastra

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 3,651కి చేరిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 211 మంది మృతి చెందగా, 365 మంది కరోనా రోగులు కోలుకున్నారు. ఈ రోజు కూడా పదుల సంఖ్యలో ఆ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి లాక్‌డౌన్‌ సడలింపులకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'రేపటి నుంచి రాష్ట్రంలో మేము పలు ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తాం. కరోనా నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో పరిమితంగా ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించాలని నిర్ణయించాం. అదృష్టవశాత్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు' అని ఉద్ధవ్ థాకరే అన్నారు.

'మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. రానున్న రోజుల్లో కరోనా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం ఉంది. ఎవరూ చింతిచొద్దు. క్రమంగా మహారాష్ట్రల్లో అన్ని పనులను ప్రారంభిస్తాం. అన్ని పనులూ సరిగ్గా జరిగితే అందరూ కార్యాలయాలకు వెళ్లి పనులు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని వలస కూలీలు బాధపడొద్దు' అని తెలిపారు.

'కరోనా సంక్షోభం ముగిసిపోగానే కూలీలు తమ ఇంటికి వెళ్లడానికి మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటివరకు 66 వేల టెస్టులు చేశాం. వాటిలో 95 శాతం నెగిటివ్ వచ్చింది. దాదాపు 3600 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వారిలో 350 మంది ఇప్పటికే డిశ్చార్జ్‌ అయ్యారు, 52 శాతం మంది రోగుల పరిస్థితి విషమంగా ఉంది' అని థాకరే చెప్పారు.

More Telugu News