Vikarabad District: 11 నెలల చిన్నారిని చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి

Mother killed her son and committed suicide
  • వికారాబాద్ జిల్లాలో ఘటన
  • నాలుగేళ్ల క్రితం ప్రేమ పెళ్లి
  • గత నెలలో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతి తన 11 నెలల పసిబిడ్డను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం.. జిల్లాలోని దౌల్తాబాద్ మండలం కుదురుమల్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ నాలుగేళ్ల క్రితం తాండూరుకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, మనస్పర్థల కారణంగా ఆరు నెలలకే ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్న యువకుడు ఓ దుస్తుల దుకాణంలో పనికి కుదిరాడు. అక్కడ పనిచేస్తుండగా మద్దూరుకు చెందిన మల్లిక (25)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో 2017లో ఇద్దరూ వివాహం చేసుకుని నల్లకుంటలో కాపురం పెట్టారు. వీరికి 11 నెలల కుమారుడు సాత్విక్ ఉన్నాడు.

నగరంలో కరోనా వైరస్ భయపెడుతుండడంతో గతనెలలో భార్యాభర్తలు ఇద్దరూ స్వగ్రామం కుదురుమల్లకు చేరుకున్నారు. నిన్న ఉదయం సాత్విక్‌కు ఆరోగ్యం బాగాలేకపోవడంతో కోస్గిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించి తీసుకొచ్చారు. మధ్యాహ్నం భోజనాల అనంతరం కుటుంబ సభ్యులు బయటకు వెళ్లగా, మల్లిక తన కుమారుడిని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. కాసేపటికి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఉరివేసుకుని కనిపించిన మల్లికను చూసి విస్తుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Vikarabad District
Telangana
Mother
Suicide

More Telugu News