Nagarkurnool District: తన కుమారుడిని అడ్డుకున్నారని.. స్టేషన్‌‌కు వచ్చి వీరంగమేసిన టీఆర్ఎస్ ఎంపీ

Nagarkurnool TRS MP Ramulu fires on Police
  • ఎంపీ స్టిక్కర్ ఉన్న కారులో కనిపించని ఎంపీ
  • అడ్డుకున్న పోలీసులతో భరత్‌కుమార్ వాగ్వివాదం
  • తర్వాతి రోజు స్టేషన్‌కు వచ్చి పోలీసులపై ఎంపీ ఆగ్రహం
కారులో వెళ్తున్న తన కుమారుడిని అడ్డుకున్నారన్న కారణంతో నాగర్‌కర్నూలు టీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు పోలీసులతో గొడవ పడ్డారు. హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఎంపీ కుమారుడు, కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడు అయిన భరత్ కుమార్ ఈ నెల 15న మరో నలుగురితో కలిసి కారులో నగరానికి వస్తున్నారు. పహాడీషరీఫ్-శ్రీశైలం రహదారిపై లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీసులు ఎంపీ స్టిక్కర్‌తో ఉన్న కారులో ఎంపీ కనిపించకపోవడంతో కారును ఆపారు. దీంతో భరత్‌కుమార్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తాను ఎంపీ కుమారుడినంటూ పోలీసులను హెచ్చరించారు. దీంతో పోలీసులు కారును పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోసారి ఇలా చేయొద్దంటూ భరత్‌కుమార్‌కు చెప్పి వదిలేశారు.

విషయం తెలిసిన ఎంపీ రాములు ఆ తర్వాతి రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తన కుమారుడు వెళ్తున్న కారును ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. తాను 15 ఏళ్లు రాష్ట్రమంత్రిగా పనిచేశానని, ప్రస్తుతం ఎంపీగా ఉన్నానని, తన కారును ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Nagarkurnool District
pothuganti ramulu
TRS

More Telugu News